సూపర్‌స్టార్ రజనీకాంత్.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గారు. ఆరోగ్యకారణల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.
"నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది. నా నిర్ణయం అభిమానులను బాధపెట్టొచ్చు.. నన్ను క్షమించాలి.
ప్రస్తుతం అనారోగ్యం రావడం.. దేవుడి చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను. చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మా చిత్రబృందంలో కొంతమందికి కరోనా సోకింది. అర్ధాంతరంగా షూటింగ్ వాయిదావేయాల్సి వచ్చింది. నాకు కరోనా నెగెటివ్ వచ్చినా అధిక రక్తపోటుతో బాధపడ్డాను. రక్తపోటులో హెచ్చుతగ్గులు కిడ్నీలపై ప్రభావం చూపుతాయని వెద్యులు చెప్పారు. పార్టీ ప్రారంభించినా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే గెలవలేను. ప్రజలు ఆశించేస్థాయిలో రాజకీయ తిరుగుబాటు సృష్టించలేను. రాజకీయ అనుభవమున్న ఎవరైనా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారు."
- రజనీకాంత్, సినీనటుడు
వైద్యుల సూచన..
రజనీ త్వరగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు రజనీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కొవిడ్ సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొన వద్దని సూచించారు. అదే సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.