రాజస్థాన్‌లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై వేటు వేసిన కాంగ్రెస్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని యోచిస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన సమావేశంలో నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంతో పాటు నిర్వహించిన మంత్రిమండలి భేటీలోనూ రాజస్థాన్‌లో తాజా పరిస్థితులపై మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడిగా తొలగింపు
వరుసగా.. రెండో రోజు సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై వేటు వేసింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, అహ్మద్ పటేల్ వంటి అగ్రనేతలు మాట్లాడినా సీఎల్పీ భేటీకి పైలట్ వర్గం డుమ్మా కొట్టగా ఆయనకు ఉద్వాసన పలికే తీర్మానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సీఎల్పీ సమావేశానికి వచ్చేందుకు రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ పైలట్ నుంచి స్పందన రాకపోవడంతో ఆయనను తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ తెలిపింది.
ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి పైలట్‌ను తప్పించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. ఆయన విధేయులైన విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాను మంత్రి పదవుల నుంచి తప్పించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లే కనిపిస్తున్న సచిన్ పైలట్ నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త సారథి డోటాస్రా..
రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి అవినాశ్ పాండే పార్టీ కార్యనిర్వాహక మండలి సహా పీసీసీలోని అన్ని విభాగాలను రద్దు చేశారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా సచిన్ పైలట్‌ను తప్పించి నూతన సారథిగా గోవింద్ సింగ్ డోటాస్రాను నియమించారు. నూతన పీసీసీ అధ్యక్షుడి అనుమతి లేకుండా పార్టీ నేతలెవరూ మీడియాతో మాట్లాడకూడదని స్పష్టం చేశారు.