రాజస్థాన్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అశోక్ గహ్లోత్ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగాఅవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా తెలిపారు.
దాదాపు నెల రోజుల పాటు మలుపులు తిరిగి ముగిసిందనుకున్న రాజస్థాన్ రాజకీయం భాజపా నిర్ణయంతో మళ్లీ వేడెక్కింది. మరి సచిన్ పైలట్ వర్గం రేపటి బలపరీక్షలో గహ్లోత్‌ను గెలిపిస్తుందా అనేది వేచి చూడాలి.
అనిశ్చితికి ఇదే కారణం...
గహ్లోత్ ప్రభుత్వంపై అసంతృప్తితో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. స్పీకర్ అనర్హత నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. కొద్దిరోజులు గహ్లోత్, పైలట్ ఎవరి క్యాంప్ వారే నడుపుతూ రాజకీయాన్ని వేడెక్కించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారమూ జరిగింది. అయితే, ఎట్టకేలకు రాహుల్ గాంధీ జోక్యంతో పైలట్ సొంతగూటికి చేరడం వల్ల పరిస్థితి సద్దుమణిగింది. దీంతో, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ముగిసిందని కాంగ్రెస్ సోమవారం ప్రకటించింది. కానీ, ఇప్పుడు భాజపా అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్‌కు కొత్త తంటాలు తెచ్చిపెట్టింది.
ఇదీ చదవండి: అన్నీ మరచిపోయి ముందుకు సాగాలి: గహ్లోత్