తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచిన్​ బృందం 'వీడియో'తో గహ్లోత్​ ప్రభుత్వానికి చెక్​! - రాజస్థాన్​ కాంగ్రెస్​లో సంక్షోభం

RAJASTAN POLITICS
రాజస్థాన్​ కాంగ్రెస్​లో సంక్షోభం

By

Published : Jul 13, 2020, 10:21 AM IST

Updated : Jul 13, 2020, 11:19 PM IST

23:15 July 13

వీడియో రాజకీయాలు...

రాజస్థాన్​ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్​ బృందం ఓ వీడియో క్లిప్​ను విడుదల చేసింది. ఇందులో ఇందర్​ రాజ్​ గుర్జార్​, పీఆర్​ మీనా, జీఆర్​ ఖటానాతో సహా ఇతర కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఓ హొటల్​లో ఉన్నట్టు కనపడుతోంది. అయితే ఇందులో సచిన్​ పైలట్​ లేరు. తమకు 109మంది ఎమ్మెల్యేల మద్దతుందని కాంగ్రెస్​ ప్రకటించిన కొద్ది సేపటికే సచిన్​ బృందం ఈ వీడియోను విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

21:13 July 13

'సచిన్​ రావాలి.. సమస్యలు చెప్పాలి'

మంగళవారం మరోమారు సీఎల్​పీ సమావేశం జరగనున్నట్టు కాంగ్రెస్​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా వెల్లడించారు. సచిన్​ పైలట్​ సహా ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు.. సమావేశంలో పాల్గొనాలని అభ్యర్థించారు. తమ సమస్యలను చర్చించాలని పేర్కొన్నారు. ఎవరితోనైనా విభేదాలు ఉంటే.. వెంటనే చెప్పాలని, సోనియా- రాహుల్​ గాంధీలు సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

21:07 July 13

'109 ఎమ్మెల్యేల మద్దతు'

109 ఎమ్మెల్యేలతో రాజస్థాన్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం స్థిరంగా ఉందని పార్టీ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా వెల్లడించారు. ఈ మేరకు పార్టీకి మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలు అందరూ లేఖ అందించారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న భాజపా ప్రణాళికలు విఫలమయ్యాయని తెలిపారు.

16:17 July 13

రాజస్థాన్‌లో రాజకీయ వేడి కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటాతో సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్టులకు తరలిస్తున్నారు. మొత్తం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు గహ్లోత్‌ ప్రభుత్వానికే ఉన్నట్లు గహ్లోత్‌ వర్గం ప్రకటించింది. అయితే, ఈ సమావేశానికి 97 మంది హాజరయ్యారని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. కేవలం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే సచిన్‌ వర్గం వైపు ఉన్నట్లు తెలుస్తోంది. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిన్న సచిన్‌ పైలట్‌ ప్రకటించడం గమనార్హం.

కొనసాగుతున్న మంతనాలు

ఓ వైపు సీఎల్పీ సమావేశాన్ని వేదికగా చేసుకుని బలప్రదర్శన చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. మరోవైపు రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌తో బుజ్జగించే ప్రయత్నాలను మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది. సీఎల్పీ సమావేశానికి ముందు ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా.. పైలట్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ పార్టీ అగ్రనాయకులు రాహుల్‌, ప్రియాంక, చిదంబరం, కేసీ వేణుగోపాల్‌ సైతం సచిన్‌ పైలట్‌తో మాట్లాడినట్లు సమాచారం.

కేబినెట్‌ విస్తరణ?

అశోక్‌ గహ్లోత్‌పై అసంతృప్తితో ఉన్న సచిన్‌ పైలట్‌ను సంతృప్తి పరిచేందుకు కేబినెట్‌ విస్తరణ చేపట్టాలని ఓ వైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ వర్గానికి చెందిన వారే మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండగా.. కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించి పైలట్‌ వర్గానికి చోటు కల్పించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా రంగంలోకి దిగితే ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన ఆ పార్టీ మధ్యప్రదేశ్‌లా మరో ప్రభుత్వాన్ని కోల్పోకూడదని తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తోంది.

15:23 July 13

బస్సుల్లో తరలింపు...

సీఎల్పీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ఇంటి నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించారు. 

15:11 July 13

ముగిసిన భేటీ...

కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ఇంటి బయట ఇప్పటికే ఎమ్మెల్యేలను తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉన్నాయి. సమావేశానికి మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి.

13:43 July 13

కాంగ్రెస్​ నాయకుల విజయ సంకేతం

ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ పార్టీ నాయకుల రాకతో సీఎం అశోక్ గహ్లోత్‌ నివాసం కోలాహలంగా మారింది. సీఎల్పీ భేటీ సందర్భంగా నాయకులు విజయ సంకేతాన్ని చూపిస్తూ.. నినాదాలు చేశారు.

12:12 July 13

భాజపా కుట్రలు సాగవు.. పూర్తికాలం మా ప్రభుత్వమే: కాంగ్రెస్​

రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందన్నారు పార్టీ సీనియర్​ నేత రణదీప్ సుర్జేవాలా. విజయవంతంగా తమ ప్రభుత్వం కాలపరిమితిని పూర్తి చేస్తుందన్నారు. రాష్ట్రంలో భాజపా కుట్రలు సాగవన్నారు. 

11:56 July 13

కాంగ్రెస్​ ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ భేటీకి హాజరుకావాలి: సుర్జేవాలా

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​ను నమ్మి ఒటేశారని, వారి నమ్మకాన్ని పార్టీ ఎమ్మెల్యేలు వారి వమ్ము చేయకుండా సీఎల్పీ భేటీకి హాజరుకావాలన్నారు సీనియర్​ నేత రణదీప్ సుర్జేవాలా. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై అధిష్ఠానం గత రెండు రోజుల్లో అనేక సార్లు సచిన్​ పైలట్​తో  మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. 

11:40 July 13

నూతన పీసీసీ చీఫ్​గా రఘువీర్​ మీనా?

రాజస్థాన్​ ప్రభుత్వంపై అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్​ తిరుగుబావుటా ఎగరేశారు. ఈ నేపథ్యంలో సచిన్​పై చర్యలు తీసుకునేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. నూతన పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు పలువురు పేరును పరిశీలిస్తోంది. సీనియర్ నేత రఘువీర్​ మీనాను నూతన పీసీసీ చీఫ్​గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.​

11:30 July 13

భాజపాలో చేరిన సచిన్​ పైలట్​: కాంగ్రెస్​

సచిన్ పైలట్ ప్రస్తుతం భాజపాలోనే ఉన్నారన్నారు ఛత్తీస్​గఢ్​ కాంగ్రెస్​ చీఫ్​ పుణియా. భాజపా గురించి తమకు తెలుసునని, ఆ పార్టీ ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్​లో నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడూ ప్రాధాన్య ఉంటుందన్నారు.  

11:17 July 13

90 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు హాజరు

సీఎం అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 90మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం.

10:52 July 13

అశోక్ గహ్లోత్​ అనుచరుల ఇళ్లపై ఐటీ దాడులు

రాజస్థాన్​ సీఎం అశోక్ గహ్లోత్​ అనుచరులు, కాంగ్రెస్​ నాయకులు ధర్మేంద్ర రాథోడ్, రాజీవ్ అరోరాకు సంబంధించిన ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. అశోక్ గహ్లోత్​ ప్రభుత్వం సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

10:41 July 13

సీఎల్పీ భేటీ..

రాజస్థాన్‌ ప్రభుత్వ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. మరి కాసేపట్లో సీఎం అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఇప్పటికే తన నివాసంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు విప్​ జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు అశోక్ గహ్లోత్‌ నివాసానికి చేరుకున్నారు. అయితే శాసనసభాపక్ష భేటీకి తాను రానని ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తేల్చిచెప్పారు. సీఎం అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వం మైనార్టీలో ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన వెంట 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. 

10:24 July 13

చేరుకుంటున్న ఎమ్మెల్యేలు..

గహ్లోత్​ నివాసానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే.. సచిన్​ పైలట్​ను సంప్రదించాలని చూసినా ఆయన స్పందించట్లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాజస్థాన్​ రాజకీయాల్లో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. 

10:23 July 13

జైపుర్​కు కేసీ..

రాజస్థాన్​ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది కాంగ్రెస్​ అధిష్ఠానం. పార్టీ సీనియర్​ నేత, కేసీ వేణుగోపాల్​ జైపుర్​కు వెళ్లనున్నారు. 

10:22 July 13

మరికాసేపట్లో భేటీ..

రాజస్థాన్​ సీఎల్పీ భేటీ మరికాసేపట్లో జరగనుంది. సీఎం గహ్లోత్​ నివాసంలో శాసనసభ్యులు భేటీ కానున్నారు. 

09:59 July 13

సీఎల్పీ భేటీకి ముందు పార్టీ ఎమ్మెల్యేలకు విప్​ జారీ

రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైన అనిశ్చితి నేపథ్యంలో మరికాసేపట్లో సీఎల్పీ భేటీ నిర్వహించనుంది పార్టీ. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నివాసంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్​ఛార్జి అవినాశ్ పాండే స్పష్టం చేశారు.

ఈ భేటీ తర్వాత పార్టీ సీనియర్ నేతలు రణ్​దీప్ సుర్జేవాలా, అజయ్​ మాకెన్ సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసింది. భేటీకి హాజరుకానివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.మాకు మద్దతు ఉంది..రాజస్థాన్​లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని పాండే తెలిపారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టం చేశారు. అశోక్ గహ్లోత్​తో ఫోన్​లో మాట్లాడిన మరో నలుగురు ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు వెల్లడించారు.

ఏం జరిగింది?

రాజస్థాన్​లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సీఎం గహ్లోత్​పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను తీసుకుని క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు. పైలట్​కు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తుండగా 200 స్థానాలు గల రాజస్థాన్ అసెంబ్లీలో గహ్లోత్ గట్టెక్కుతారా అనే అంశమై సందిగ్ధం నెలకొంది.

Last Updated : Jul 13, 2020, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details