ఎండవేడిమి నుంచి తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం లభించింది. శనివారం దాదాపు అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 6 నుంచి 14సెం.మీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. జైపుర్, అజ్మేర్, కోటాలో వర్షాలు బాగా కురిశాయి. ఐదు జిల్లాలు మినహా రాజస్థాన్ వ్యాప్తంగా వర్షాకాలంలో మొదటి సారి వరుణుడు పలకరించాడు.
దేశ రాజధాని దిల్లీని మేఘాలు కమ్మేశాయి. ఆహ్లాద వాతావరణంతో దిల్లీవాసులు పులకరించి పోయారు. నగరంలో శనివారం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
పంజాబ్, హరియాణాలోనూ వర్షాలు విస్తారంగా కురిశాయి. ఈ రెండు రాష్ట్రాల సంయుక్త రాజధాని చండీగఢ్‌లో 21.2 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జమ్ములో గత 15 రోజుల్లో సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రత శనివారం నమోదైంది. ఇక్కడ 7.6 మి.మీ వర్షపాతం నమోదైంది.