కుండపోత వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడి వందాలాది మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. ఉత్తరాదిన వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. పంజాబ్, హరియాణా, జమ్ములో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
హిమాచల్ ప్రదేశ్...
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. మరో 24 గంటలపాటు అనేక చోట్ల కుంభవృష్టి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సట్లేజ్ నది ప్రవాహ ఉద్ధృతికి సిమ్లాలోని చాంబా ప్రాంతంలో ఓ వంతెన వరదలో కొట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడటం వల్ల కులు-మనాలి జాతీయ రహదారి ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల నాలుగైదు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. వరదల ధాటికి రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 25కు పెరిగింది. మొత్తం 500 మంది వరకు వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉత్తరాఖండ్...
ఉత్తరాఖండ్‌లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలో వరదల వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలాచోట్ల భారీ వర్షాలకు జనావాసాలు, పంటపొలాలు నీటమునిగాయి. మొత్తం మూడు చాపర్లు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. బాధితులకు ఆహార పొట్లాలు, మందులు జారవిడుస్తున్నారు. భారీవర్ష సూచనతో సోమవారం 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.