కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)లపై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ.. నోట్లరద్దును మించిన ఘోర వైఫల్యాలు అవుతాయని ఆరోపించారు.
దేశంలోని పేదలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిని తలపెట్టిందని వ్యాఖ్యానించిన రాహుల్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్నేహితులు మాత్రం వీటితో లబ్ధిపొందుతారన్నారు.
"ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్‌పై తమాషా జరుగుతోంది. ఇది నోట్ల రద్దు-2 వంటిది. వీటి వల్ల దేశ ప్రజలు నోట్ల రద్దును కూడా మర్చిపోయేంత దెబ్బ తగులుతుంది. ఇది నోట్ల రద్దు కంటే రెండింతల పెద్ద దెబ్బ. వీటి వల్ల తాము ఈ దేశ పౌరులమా, కాదా అన్న విషయాన్ని ప్రజలు దేశానికి చెప్పాలి. కాని ప్రభుత్వానికి మిత్రులైన 15 మందికి మాత్రం పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఈ 15 మంది జేబుల్లోకి వెళుతుంది."