తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ మీకు దేశభక్తి ఉందా?: రాహుల్​ - ఇటానగర్​

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. అరుణాచల్​ ప్రదేశ్​ ఇటానగర్​ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్​... చైనా అంశంలో మోదీ మౌనం వహించడమేంటని ప్రశ్నించారు.

మోదీపై రాహుల్ విమర్శలు

By

Published : Mar 20, 2019, 8:08 AM IST

Updated : Mar 20, 2019, 8:36 AM IST

''మోదీ మీకు దేశభక్తి ఉందా?: రాహుల్​''
ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్​గాంధీ. మోదీ ఒక అహంకారి అని, ఆయనకు దేశభక్తి ఉందా అని ప్రశ్నించారు. భారత దేశ గొప్పతనం గురించి, బలాబలాల గురించి మోదీకి కనీస అవగాహన లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అరుణాచల్​ప్రదేశ్​లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత భూభాగాలను చైనా దురాక్రమణ చేస్తుంటే, ప్రధాని ఏమీ పట్టనట్లు ప్రవర్తించారని రాహల్​ విమర్శంచారు. గుజరాత్​లో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో సమావేశమైన మోదీ.. ప్రాదేశిక సమగ్రత సమస్యపై కనీసం ఒక్క మాట కూడా అడగలేదని దుయ్యబట్టారు. మోదీ తన చైనా పర్యటనలో సైతం డోక్లాం దురాక్రమణ గురించి కనీసం ప్రస్తావించలేదని రాహుల్ ఆరోపించారు.

2017 జూన్​లో చైనా సైన్యం డోక్లాంలో రోడ్డు నిర్మాణపనుల కోసం హద్దుమీరింది. దీనిని భారత సైన్యం అడ్డుకుంది. భూటాన్​తో భారత్​కు ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో డోక్లాంను చైనా అక్రమించకుండా భారత్​ నిలువరించింది.

జైషే​ వ్యవస్థాపకుడు మసూద్ అజార్​పై చర్యల విషయంలో సైతం మోదీ విఫలమయ్యారని రాహుల్ విమర్శించారు. ఈ విషయంలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. మోదీ ఒక బలహీనమైన ప్రధాని అని ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అరుణాచల్​ ప్రదేశ్​ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాలకు తిరిగి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. భాజపా తనను ప్రశ్నించే వారిని అణచివేస్తోందన్నారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ఆమోదాన్ని కాంగ్రెస్​ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు.

Last Updated : Mar 20, 2019, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details