తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: దక్షిణాది నుంచి రాహుల్​ పోటీ! - వాయాండ్​

దక్షిణాదిన ఓ లోక్​సభ స్థానం నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల కాంగ్రెస్​ నేతల వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎందుకీ చర్చ? రెండో స్థానం నుంచి రాహుల్​ పోటీపై కాంగ్రెస్​ నేతల వ్యూహమేంటి?

దక్షిణాదిలోని ఓ లోక్​సభ స్థానం నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేసే అవకాశం

By

Published : Mar 25, 2019, 9:08 AM IST

దక్షిణాదిలోని ఓ లోక్​సభ స్థానం నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేసే అవకాశం

"కేరళ నుంచి రాహుల్​ గాంధీ పోటీ చేస్తే రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం, శక్తి మరింత పెరుగుతాయి. అగ్రనేత పోటీకి దిగితే.. ఆ చుట్టు పక్కల స్థానాల్లో పోటీ చేసేవారికి బలం మరింత పెరుగుతుంది."
--శశి థరూర్​, కాంగ్రెస్​ నేత

సిద్ధరామయ్య ఆహ్వానం

కర్ణాటక నుంచి పోటీ చేయాలని రాహుల్​ గాంధీని మాజీ సీఎం సిద్ధరామయ్య కొద్దిరోజుల కిందటే కోరారు.

"దేశానికి కాబోయే ప్రధాని రాహుల్​ గాంధీ కర్ణాటక నుంచి పోటీ చేయాలని కోరుతున్నాం. పార్టీ అగ్రనాయకత్వానికి కన్నడ నేల ఎప్పుడూ మద్దతిస్తోంది. గతంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలిచినప్పుడే ఇది రుజువైంది."
--కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ట్వీట్​

" నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంలో దక్షిణాది, ఉత్తరాది అన్న భావన దేశంలో పెరిగిపోయింది. రాహుల్​ గాంధీ తమిళనాడు నుంచి గెలిస్తే ఆ అంతరాలు తొలిగిపోతాయి"
-- కె.ఎస్​.అళగిరి, తమిళనాడు కాంగ్రెస్​ అధ్యక్షుడు

కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన కొందరు నేతలు కొద్దిరోజులుగా చేస్తున్న విజ్ఞప్తులు ఇవి. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి... రాహుల్​ పోటీ చేస్తే స్థానికంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశ. రెండోది... భాజపాకు సవాలు విసరడం. దక్షిణాదిన కాంగ్రెస్​కు కాస్త పట్టుంది. భాజపా మాత్రం ఇప్పుడిప్పుడే బలపడే ప్రయత్నం చేస్తోంది. దక్షిణాదిన విస్తరణకు అధికార పక్షం చేస్తున్న యత్నాల్ని తిప్పికొట్టేందుకు రాహుల్​ను నేరుగా రంగంలోకి దించడమే సరి అన్నది... కాంగ్రెస్​ నేతల అభిప్రాయం.

"తర్వాతి ప్రధాని అవుతానన్న ఆత్మవిశ్వాసం ఉన్న అభ్యర్థి మాకున్నారు. దక్షిణాదిన, ఉత్తరాదిన రెండు చోట్ల పోటీ చేసి గెలుస్తానని ఆయన చాటిచెప్పాలని అనుకుంటున్నారు. నేను నరేంద్ర మోదీని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. రాహుల్​ గాంధీకి ఉన్న ఆత్మవిశ్వాసం మీకుందా? ఉంటే తిరువనంతపురంలో నాపై పోటీ చేయండి."
-- శశిథరూర్​, కాంగ్రెస్​ నేత

కాంగ్రెస్​ కంచుకోట నుంచి...!

వాయనాడ్​ లోక్​సభ స్థానం కేరళలో కాంగ్రెస్​కు కంచుకోట. పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్​ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయాలన్నది స్థానిక నేతల విజ్ఞప్తి.

"రాహుల్​ గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. అందువల్ల వాయనాడ్​ నుంచి పోటీ చేయాలని రాహుల్​ను కోరతాం. సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం."
-- ఉమెన్​ చాందీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

కాదనకుండానే...

రాహుల్​ అమేఠీ నుంచి పోటీ చేస్తారని చెబుతోంది కాంగ్రెస్​. రెండో స్థానం నుంచి పోటీపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.

" కేరళ ప్రజలతోపాటు దేశ ప్రజలందరూ రాహుల్​ గాంధీని ఎక్కువగా అభిమానిస్తున్నారని, ఇక్కడి నుంచే పోటీ చేయించాలని కేరళ నేతలు కోరారు. అయితే ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 'అమేఠీ నా కర్మభూమి' అని రాహుల్​ గాంధీ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు."
-- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

భాజపా విమర్శలు మొదలు..

రాహుల్​ గాంధీ దక్షిణాది నుంచి పోటీ చేస్తారనే నిర్ణయం వెలువడక ముందే భాజపా నేతలు విమర్శలు ప్రారంభించారు. అమేఠీ నియోజకవర్గానికి రాహుల్​ గాంధీ ఏమీ చేయలేదని, ఇక్కడి ప్రజలు ఆయనను తిరస్కరించారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే మరో స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్​ అధ్యక్షుడు​ ప్రయత్నాలు ప్రారంభించారని ఎద్దేవా చేశారు.

2014లో రాహుల్​పై అమేఠీ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు స్మృతి. ఇప్పుడు మరోసారి ఆయనపై ఇదే స్థానంలో పోటీకి దిగనున్నారు.

ABOUT THE AUTHOR

...view details