తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కంట్రోలర్​ శాసిస్తారు.. మోదీ పాటిస్తారు' - కాంగ్రెస్​

కంట్రోలర్​ చెప్పినట్టే ప్రధాని మోదీ సభల్లో ప్రసంగిస్తారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. అందుకే ఆయన నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదల ఖాతాల్లో రూ.15లక్షల జమ గురించి అసలు మాట్లాడరని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అవివేక నిర్ణయాలంటూ విమర్శించారు రాహుల్​.

రాహుల్​ గాంధీ

By

Published : Apr 27, 2019, 8:53 PM IST

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అవివేక నిర్ణయాలు 70ఏళ్లలో ఎవరూ తీసుకోలేదని విమర్శించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. మోదీ ప్రతి సభలోనూ టెలీప్రాంప్టర్​ చూసే మాట్లాడతారని అన్నారు రాహుల్​. వెనుక ఉండే కంట్రోలర్​​ ఏది చెబితే ఆయన అదే ప్రసంగిస్తారని ఎద్దేవా చేశారు.

ఉద్యోగాల భర్తీలో విఫలం

దేశంలో 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రాహుల్​ గాంధీ. కేవలం మిత్రుల కోసమే మోదీ పని చేస్తారని విమర్శించారు. తాము అధికారంలో వస్తే 10లక్షల ఉద్యోగాలను ఏడాదిలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్​.

20వేలు కట్టకుంటే జైలుకా..

మోదీ హయాంలో వేల కోట్ల రుణాలు ఎగవేసిన విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీ వంటి వారు బయట తిరుగుతుంటే, రూ.20వేల అప్పు తీసుకొని కట్టలేని రైతులను జైలుకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్​ గాంధీ. తమ ప్రభుత్వం వస్తే రైతులపై ఉన్న రుణఎగవేత కేసులన్నీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.

వాటి గురించి మాట్లాడరే..

దేశంలోని సమస్యలపై మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని విమర్శించారు రాహుల్​ గాంధీ.

మాట్లాడుతున్న కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ

" నరేంద్ర మోదీ దేశానికి ఐదేళ్లుగా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రసంగాలు వినండి. టెలీప్రాంప్టర్​ ఉంటుంది. వెనుక కంట్రోలర్​ ఉంటుంది. నరేంద్ర మోదీ మీరు ఉద్యోగాల గురించి మాట్లాడొద్దని కంట్రోలర్​ చెబుతుంది. అలాగే రూ.15లక్షల గురించి మాట్లాడొద్దు.. ప్రజలకు కోపమొస్తుందని చెబుతుంది. రైతుల గురించి ప్రస్తావించొద్దని అంటుంది. కంట్రోలర్​ వెనుక నుంచి ఆయనను నియంత్రిస్తుంది. ఆయన అదే చెబుతారు. ఇక పరిస్థితి మారుతుంది. నరేంద్ర మోదీ ఓడిపోతారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో వస్తుంది."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details