సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ... పార్టీలో జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తన రాజీనామా లేఖలో... వీలైనంత త్వరగా నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సూచించారు. అందులో తన పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు.
దేశానికి, పార్టీకి సేవలు అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
బంగారు భవిష్యత్ కోసమే...
సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండాలంటే.. జవాబుదారీతనం కీలకమని రాహుల్ పేర్కొన్నారు.
"పార్టీ భవిష్యత్ బాగుండాలి అంటే జవాబుదారీతనం అవసరం. అందుకే నేను పార్టీ ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాను."- రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్తో కొన్ని సమయాల్లో ఒంటరి పోరు చేసినట్లు పేర్కొన్న రాహుల్ అందుకు గర్వంగా ఉందని అన్నారు.
కఠిన నిర్ణయాలు తప్పనిసరి..
పార్టీ పునర్ నిర్మాణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరని రాహుల్ వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల్లో ఓటమికి చాలా మందిని బాధ్యులుగా చేయాల్సిన అవసరమూ ఉందని ఆయన అన్నారు. ఈ ఓటమిలో పార్టీ అధ్యక్షుడిగా నా బాధ్యతనూ విస్మరించబోనని రాహుల్ వెల్లడించారు.
"అధికారాన్ని హస్త గతం చేసుకోవాలనే కోరికను త్యాగం చేయకుండా ప్రత్యర్థులను ఓడించలేం." -రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ... తనకు తాను పూర్తి స్థాయిలో మార్పు చెందాలని, ప్రజల గొంతుకను అణచివేస్తున్న భాజపాతో పోరాడటం పార్టీ విధి అని రాహుల్ అన్నారు.
నా ప్రమేయం ఉండదు..
నూతన అధ్యక్షుడిని నామినేట్ చేయమని తనకు కొంతమంది నాయకులు సలహా ఇచ్చారని.. అయితే తాను సూచించడం సరికాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. సమర్థుడైన నాయకుడ్ని పార్టీ ఎన్నుకోగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే కొనసాగుతానని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: రాహుల్ నిష్క్రమణ... కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు!