ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. మోదీ ధనికుల పక్షపాతి అని ఆరోపించారు. పేదల జేబుల నుంచి డబ్బుని తీసుకెళ్లి బడా వ్యాపారవేత్తలకు చేరవేస్తున్నారని ధ్వజమెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నూహ్‌లో తొలి ర్యాలీలో పాల్గొన్నారు రాహుల్. ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, మోదీలపై విమర్శలు గుప్పించారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు విభజించు పాలించు విధానాన్ని ఆచరిస్తున్నాయని ధ్వజమెత్తారు రాహుల్.
" భాజపా, ఆర్ఎస్ఎస్ల పని గతంలో ఆంగ్లేయులు చేసినట్లుగా దేశాన్ని విభజించడం, ఒకరితో మరొకరికి గొడవలు పెట్టడం. నరేంద్ర మోదీ 15 మంది ధనికులకు కార్పొరేట్ పన్ను రద్దు చేశారు. రూ.లక్షా నలబై వేల కోట్లు ఒక్క రోజులో మాఫీ చేశారు. ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను 15 నుంచి 20 మందికి చేరవేస్తోంది. వాళ్లు దేశం విడిచి పారిపోతున్నారు. విజయ్ మాల్యాలా.. ఫ్రాన్స్, అమెరికా, లండన్‌లో తలదాచుకుంటున్నారు . "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత