'నెలనెలా రూ.6వేలు ఇవ్వడం ఖాయం' కనీస ఆదాయ హామీ పథకాన్ని పేదరికంపై చేసే మెరుపు దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాజస్థాన్ జైపూర్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం రూపొందించే సమయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో చర్చలు జరిపినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇది 'టాప్-అప్' పథకం కాదని స్పష్టం చేశారు.
నిరుపేదలైన మహిళలకు సంవత్సరానికి రూ. 72 వేలు అందజేసే పథకంపై భాజపా విమర్శలను రాహుల్ తప్పుబట్టారు.ఈ పథకాన్ని అధికార పక్షం వ్యతిరేకిస్తుందా..? అని ప్రశ్నించారు. కనీస ఆదాయ పథకం పేదలకు ఉచిత బహుమతేనని, కానీ ఇది న్యాయమైనదన్నారు. 21వ శతాబ్దం కల్లా దేశంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటమే ధ్యేయమని స్పష్టం చేశారు.
72 వేల రూపాయలను నిరుపేదలైన 20 శాతం మందికి నేరుగా బ్యాంకు ఖాతాలో తప్పక జమ చేస్తాం. పథకం పేరు చాలా అందంగా ఉంటుంది పేరు న్యూన్తమ్-ఆయ్-యోజన- న్యాయ్. ఈ పథకం కింద మహిళల ఖాతాలో నేరుగా 72 వేలు జమచేస్తాం.- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
నెలకు 12 వేలను కనీస ఆదాయ రేఖగా గుర్తించినట్లు రాహుల్ తెలిపారు. దీని కంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి కనీస ఆదాయ పథకం వర్తింప జేస్తామని రాహుల్ ప్రకటించారు. ఈ పథకం కోసం గత ఆరు నెలలుగా పలు రంగాల్లోని నిష్ణాతులతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు రాహుల్ తెలిపారు.
అనుమానాలు తగవు..
కుటుంబ ఆదాయం రూ.12వేల కంటే ఎంత తగ్గితే అంత మొత్తాన్ని మాత్రమే ఇస్తారన్న విశ్లేషణలను కాంగ్రెస్అధికార ప్రతినిధి సుర్జేవాలా తోసిపుచ్చారు.పేద కుటుంబాలకు నెలకు రూ.6వేలు చొప్పున కచ్చితంగా ఏడాదికి రూ.72వేలు ఇస్తామని స్పష్టంచేశారు.