కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో.. ఆ పార్టీ ఎంపీలు శనివారం మధ్యాహ్నం హాథ్రస్ బాధితురాలి కుటుంబాన్ని కలవనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రకటన ద్వారా వెల్లడించింది. దుఃఖంలో మునిగి ఉన్న ఆ కుటుంబసభ్యులకు ఓదార్పు అందించకుండా ప్రపంచంలో ఏ శక్తీ తమను ఆపలేదని స్పష్టం చేశారు రాహుల్.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అసమర్థతలకు నిరసనగా.. అక్టోబర్ 5న దేశవ్యాప్తంగా తాము సత్యాగ్రహాన్ని చేపట్టనున్నట్టు తెలిపింది కాంగ్రెస్.
అక్టోబర్ 1న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను.. పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. అనంతరం అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కింద పడిపోయారు. పోలీసులు తనను పక్కకు తోసి లాఠీఛార్జి చేశారంటూ రాహుల్ ఆరోపించారు. తమను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ దేశంలో భాజపా, ఆరెస్సెస్ నేతలకు తప్ప మిగిలిన వారికి రహదారిపై నడిచే అవకాశం కూడా లేదా? అని రాహుల్ ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్‌కు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని.. ఆయన రాజీనామా చేయాలని ప్రియాంకా గాంధీ సైతం డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:అత్యాచార బాధితురాలి ఆత్మహత్య.. పోలీసులే కారణం!