నూతన వ్యవసాయ బిల్లులను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్.. మంగళవారం స్వరం పెంచింది. నూతన బిల్లుల సాయంతో ప్రధాని మోదీ తన పెట్టుబడిదారీ మిత్రుల అభివృద్ధికి ప్రయత్నిస్తున్నారని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
"2014 ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సూచించిన ఎంఎస్పీని అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. 2015లో అది అమలు చేయలేమని కోర్టుకు చెప్పారు. 2020లో వ్యవసాయ రంగానికి కళంకంగా మారిన నూతన బిల్లులను తెచ్చారు. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
బిల్లుల్లో పొందుపర్చిన కొన్ని అంశాలను కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బిల్లులను సమర్థిస్తూ 'వన్ నేషన్-వన్ మార్కెట్' తమ ఉద్దేశం అని కేంద్రం చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.