తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సత్వర న్యాయం.. ఎప్పటికి సాధ్యం? చిన్న దేశాలే నయం!

సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం తమ కర్తవ్యమని ప్రభుత్వాలు ఉదాత్త ఆశయాలను ప్రకటిస్తాయి. దీన్ని సాధించాలంటే శీఘ్రంగా న్యాయం జరిపించడమూ అవసరం. అయితే దేశంలో న్యాయం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారానికి తగ్గట్లు న్యాయవ్యవస్థలో నియామకాలు లేకపోవడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటున్నాయి.

JUSTICE
సత్వర న్యాయం... ఎప్పటికి సాధ్యం?

By

Published : Dec 6, 2019, 7:25 AM IST

పాలకులు న్యాయంగా పాలిస్తున్నారని ప్రజలు భావించలేనప్పుడు జనస్వామ్యం పలచబడుతుంది. నేరం జరిగినప్పుడు వేగంగా న్యాయం చేయకపోతే ప్రజలకు పరిపాలన మీద నమ్మకం సడలి, హింసాత్మక పంథా చేపట్టే ప్రమాదం ఉంది. భారతదేశం ఇప్పటికీ కాలం చెల్లిన చట్టాలతో, నాసిరకం న్యాయ సేవలతో, న్యాయ వసతుల లోపంతో నెట్టుకొస్తోంది. పోలీసు, జైళ్లు, న్యాయవ్యవస్థల్లో ఖాళీలను రాష్ట్రాలు ఎంతకీ భర్తీచేయనందువల్ల న్యాయం జరగడంలో ఆలస్యం పెరిగిపోతోంది. రాష్ట్రాల బడ్జెట్‌లో ఈ మూడు విభాగాలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడం, కేంద్రం ఇచ్చే నిధులను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల న్యాయ సాధన నీరుగారిపోతోంది. ఈ పరిస్థితిలో న్యాయం జరగడమనేది మహా జటిలమైన, ఖరీదైన, కాలయాపనతో కూడిన వ్యవహారమని భావిస్తూ- భారతీయులు ఎందరో న్యాయస్థానాలను ఆశ్రయించడానికి, పోలీసుల సాయం కోరడానికి వెనకాడుతున్నారు. 40 శాతం భారతీయులు తీవ్ర వివాదాలను సైతం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కుల-మత పెద్దలు, గ్రామ పెద్దల సాయంతో పరిష్కరించుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఆశ్చర్యమేముంది?

చిన్న దేశాలే నయం

సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం తమ కర్తవ్యమని ప్రభుత్వాలు ఉదాత్త ఆశయాలను ప్రకటిస్తాయి. దీన్ని సాధించాలంటే శీఘ్రంగా న్యాయం జరిపించడమూ అవసరం. కానీ, 2019 న్యాయ పాలన సూచీలో భారత్‌ 68వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్ఛు 126 దేశాలతో రూపొందిన ఈ సూచీలో భారత్‌ కన్నా నేపాల్‌, శ్రీలంకలు ముందున్నాయి. భద్రత కల్పన; సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో శీఘ్ర న్యాయ సాధనలోనూ భారత్‌ ఎంతో వెనకబడిపోయింది. దేశమంతటా 1,400 జైళ్లలో మగ్గుతున్న 4.33 లక్షలమంది ఖైదీల పరిస్థితిని పరిశీలిస్తే న్యాయ సాధనలో ఏ మేరకు జాప్యం జరుగుతున్నదో అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన ‘జాతీయ నేర గణాంకాల బ్యూరో’ నివేదిక ప్రకారం మొత్తం ఖైదీల్లో 67 శాతం విచారణలో ఉన్నవారు. 1,942 మంది బాలలు తమ తల్లులతో పాటు జైళ్లలో గడుపుతున్నారు. వీరంతా నేరం రుజువై కారాగారం పాలైనవారు కారు. బెయిలు ఇవ్వడానికి వీల్లేని నేరాల్లో నిందితులు కావడం వల్ల- బెయిలు కోసం ప్రయత్నించే స్థోమత లేని నిరు పేదలు కావడం వల్ల జైళ్లలో మగ్గవలసి వస్తోంది. వీరిలో అత్యధికులు నిరక్షరాస్యులు, దళితులు, గ్రామీణ పేదలే. చివరకు వీళ్లు జైలు నుంచి విడుదలయ్యేసరికి ముదిమి మీదపడుతుంది. విలువైన కాలం కారాగారంలోనే గడిచిపోయి ఆరోగ్యం, అయినవాళ్లతో సంబంధాలు దెబ్బతినిపోతాయి. నిరాశామయ భవిష్యత్తు వెక్కిరిస్తూ ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కూ ఈ దుస్థితి తప్పలేదు. ‘క్రయోజెనిక్‌ రాకెట్‌ ఇంజిన్‌’ తయారీ ప్రాజెక్టు రహస్యాలను బయటికి చేరవేశారనే తప్పుడు ఆరోపణలతో నారాయణన్‌ 1994లో జైలు పాలయ్యారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఈ ఆరోపణలు తప్పని నిరూపితమైనాక 1998లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శాస్త్రవేత్తగా ఆయన వృత్తిజీవితం నాశనమైంది. వ్యక్తిగత జీవితం కకావికలమైంది.

సత్వర న్యాయం... ఎప్పటికి సాధ్యం?

తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి

పోలీసులు, జైళ్లు, న్యాయ వ్యవస్థ, న్యాయ సహాయ కల్పన వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు అగ్ర స్థానంలో ఉన్నాయి. కొన్ని అంశాల్లో ఆ రాష్ట్రాల పనితీరు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో శీఘ్ర న్యాయం అందించడంలో తెలంగాణ ర్యాంకు 11 అయితే, ఆంధ్రప్రదేశ్‌ ర్యాంకు 13. తెలంగాణకు పోలీసుల పనితీరులో 11, జైళ్ల నిర్వహణలో 13; న్యాయ వ్యవస్థ పనితీరులో 11, న్యాయ సహాయం అందించడంలో నాలుగో ర్యాంకులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు పోలీసుల పనితీరులో అయిదు, జైళ్ల నిర్వహణలో 15; న్యాయ వ్యవస్థ పనితీరులో 13, న్యాయ సహాయ కల్పనలో పదో ర్యాంకులు లభించాయి.

న్యాయ వ్యవస్థలో 20 నుంచి 40 శాతం ఖాళీలు భర్తీ కావడంలేదు. మంజూరైన న్యాయమూర్తుల స్థానాల్లో సైతం 23 శాతాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. 22 శాతం పోలీసు కొలువులు, 33 శాతం జైళ్లలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. న్యాయ సాధనకు నాలుగు మూల స్తంభాలైన పోలీసు, జైళ్లు, న్యాయస్థానాలు, న్యాయ సహాయ సేవలను పటిష్ఠంగా, సమర్థంగా మలచాలనే పట్టుదల రాష్ట్రాలకు లోపించడంవల్లే న్యాయ సాధనలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఈ నాలుగు విభాగాల్లో 60 శాతానికి పైగా మార్కులు సాధించలేకపోయిన నిష్ఠుర సత్యాన్ని టాటా ట్రస్ట్‌ విడుదల చేసిన 2019 సంవత్సర ‘భారత న్యాయ నివేదిక’ బయటపెట్టింది. నాలుగు మూల స్తంభాల్లో ఖాళీలను పేరబెట్టడంలో అన్ని రాష్ట్రాలదీ ఒకే ఒరవడి. బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయం అందించే కార్యక్రమంపై రాష్ట్రాలు చేసే తలసరి వార్షిక వ్యయం ఒక్క రూపాయికన్నా తక్కువే. బడ్జెట్‌ కేటాయింపులను పూర్తిగా ఖర్చు చేయకపోవడం వల్లనే ఈ దురవస్థ దాపురిస్తోంది. న్యాయ స్థానాలు, న్యాయమూర్తుల పైన చేస్తున్న ఖర్చు అంతంతమాత్రం కాబట్టి- భారత్‌లో న్యాయం జరగడం నత్తనడక వ్యవహారమై, న్యాయ వ్యవస్థ కోట్లాది అపరిష్కృత కేసులకు చిరునామాగా మారింది. న్యాయ వ్యవస్థపై రాష్ట్రాల వ్యయం ఏటికేడాది పెరుగుతూనే ఉన్నా, వివిధ పద్దులపై రాష్ట్రాల మొత్తం వ్యయం అంతకన్నా భారీగా పెరుగుతోంది. న్యాయ వ్యవస్థ బడ్జెట్లను తయారుచేసి, అధికారులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడమూ ఒక సమస్యే. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ లోపాన్ని ఎత్తిచూపింది. న్యాయ వ్యవస్థ సిబ్బంది జీతభత్యాలు, కనీస నిర్వహణ ఖర్చులకు బడ్జెట్‌ వేసి సరిపెడుతున్నారే తప్ప నవీకరణ, ప్రయోగాలకు నిధులు కేటాయించాలన్న స్పృహ వారికి ఉండటం లేదు.

కొత్త జడ్జి కొలువులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా, వాటిలో 23 శాతం ఇప్పటికీ భర్తీ కాలేదు. న్యాయ వ్యవస్థకు ఇంకా 6,000 మంది జడ్జీలు కావాలని స్వయంగా కేంద్ర న్యాయ శాఖే తెలిపింది. ఈ ఆరు వేల పదవుల్లో 5,000 కొలువులు దిగువ కోర్టుల్లోనే భర్తీ కావాల్సి ఉంది. దిల్లీ తప్ప మరే రాష్ట్రమూ తన మొత్తం బడ్జెట్‌లో కనీసం ఒక్క శాతమైనా న్యాయ వ్యవస్థపై ఖర్చు చేయడంలేదు. జాతీయ బడ్జెట్‌లో సైతం కేవలం 0.08 శాతాన్ని వెచ్చిస్తున్నారు. ఈ కారణం వల్లనే భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాకు కేవలం 19మంది న్యాయమూర్తులు ఉన్నారు.

దర్యాప్తుల తాబేటి నడక

కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లలో పోలీసు శాఖపై వ్యయం మూడు శాతాన్ని మించడం లేదు. 2016లో ప్రతి లక్ష జనాభాకు 181 మంది పోలీసులు ఉండాలని నిర్దేశించినా, వాస్తవంలో 137 మందే లెక్కతేలారు. ఐక్యరాజ్య సమితి ప్రతి లక్ష జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలని సూచించింది. అరకొర పోలీసు సిబ్బందితో పని జరగదు కాబట్టి 2005-2015 మధ్య కాలంలో ప్రతి లక్ష జనాభాకు నేరాల రేటు 28 శాతం పెరిగింది. మరోవైపు నేరాలకు శిక్ష పడే రేటు తగ్గిపోయింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద నమోదైనవాటిలో 47 శాతం కేసులకు మాత్రమే 2015లో శిక్షలు పడ్డాయి. సుశిక్షిత సిబ్బందికి కొరత ఏర్పడటం వల్ల దర్యాప్తులు నాసిగా జరిగి కేసులు తేలిపోతున్నాయని లా కమిషన్‌ పేర్కొంది. పోలీసు, జైళ్లు, న్యాయ వ్యవస్థల్లో ఖాళీలను బాగా తగ్గించగలిగిన రాష్ట్రం గుజరాత్‌ ఒక్కటే.

మహిళా ప్రాతినిధ్యానికి వస్తే పోలీసు శాఖల్లో వారి నిష్పత్తి బాగా తక్కువగా ఉంటోంది. మొత్తం 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం ఎనిమిదింటిలో మాత్రమే పోలీసు శాఖల్లో మహిళలు 10 శాతాన్ని మించి ఉన్నారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో విధిగా మహిళా సిబ్బంది ఉండాలి. స్త్రీలపై నేరాలు జరిగినప్పుడు వారు రంగంలోకి దిగాలి. కానీ, ఈ విధులు నిర్వహించడానికి చాలినంతమంది మహిళా సిబ్బంది లేకపోవడం పెద్ద లోపం. అరకొర సిబ్బంది, నిధులు న్యాయ వ్యవస్థనూ కుంటుపరుస్తున్నాయి. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నల్సా) బడ్జెట్‌ నిధులను ఏ ఒక్క రాష్ట్రం కానీ, కేంద్ర పాలిత ప్రాంతంకానీ పూర్తిగా వినియోగించుకోవడం లేదు. నల్సా బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తుంది. వివాదాల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తుంది. దేశ జనాభాలో 80 శాతం కోర్టు వ్యయాలను భరించలేని స్థితిలో ఉన్నవారే. వారికి ప్రభుత్వ ఖర్చుతో ఉచిత న్యాయ సేవలు అందించాల్సి ఉంటుంది. వారిపై వార్షిక తలసరి వ్యయం మాత్రం 75 పైసలకు మించడం లేదు.

న్యాయం పొందే హక్కు అందరికీ ఉంది. ఆ హక్కును వినియోగించుకునే సౌలభ్యం అందరికీ ఉండాలి. ఆధునిక ప్రపంచంలో నేరాలు, హింసా ప్రవృత్తి నానాటికీ పెరుగుతున్నాయి. బాధితులు తక్కువ వ్యయంతో, సమర్థంగా, సులువుగా న్యాయం పొందే వెసులుబాటును కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ పరిస్థితిని సత్వరం సరిదిద్దాలి.

ఇదీ చూడండి:'ఐపీసీ, సీఆర్​పీసీల సవరణకు సూచనలివ్వండి'

ABOUT THE AUTHOR

...view details