తన అసాధారణ ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు పంజాబ్ పోలీసు శాఖకు చెందిన ఓ సీనియర్ కానిస్టేబుల్. చిత్రకళా నైపుణ్యంతో చక్కని కళాఖండాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు అశోక్ కుమార్. జలందర్‌లో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు చోటు సంపాదించింది. చండీగఢ్‌లోని ప్రముఖ సుఖ్‌నా సరస్సు ఒడ్డున కూర్చుని పెన్సిల్‌తో బొమ్మలు గీసేవాడు అశోక్. పంజాబ్ పోలీస్ విభాగంలో ఉద్యోగం వచ్చిన తర్వాతా తన అభిరుచిని పక్కన పెట్టలేదు.
"చిన్నప్పటినుంచీ పెయింటింగ్‌పై నాకు ఆసక్తి ఉండేది. పంజాబ్ పోలీస్ శాఖలో నాకు ఉద్యోగం రావడానికి కూడా పెయింటింగే కారణం. డ్యూటీ ముగిసిన తర్వాత ఎప్పుడు సమయం దొరికినా పెన్సిల్ చేతబడతాను. నా ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తా. నా పై అధికారులకు నా నైపుణ్యాలు చూపించే అవకాశం కూడా దక్కింది."
-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్
బడికెళ్లే నాటి నుంచే పెయింటింగ్స్ వేస్తున్న అశోక్‌కుమార్.. క్రమంగా అవార్డులూ గెలుచుకున్నాడు.
"బడిలో చదువుకునే సమయంలోనే పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాను. చండీగఢ్‌లోని సుఖ్‌నా సరస్సు వద్ద కూర్చుని, పెన్సిల్‌తో బొమ్మలు గీసుకునేవాణ్ని. గడిచిన రెండు మూడేళ్లలో నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా అవార్డులు రావడం మొదలైంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా వరల్డ్ రికార్డ్స్‌లో మూడు సార్లు చోటు సాధించా. గిన్నిస్ బుక్‌లో నా పేరు చూసుకునేందుకు కష్టపడుతున్నా. పంజాబ్ పోలీసుల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని ఆకాంక్షిస్తున్నా."
-అశోక్ కుమార్, సీనియర్ కానిస్టేబుల్
ఇతరుల పెయింటింగ్‌లతో పోలిస్తే.. తన చిత్రకళ ఎందుకు విభిన్నమో వివరిస్తున్నాడు అశోక్.
"మొదట్లో మీనియేటర్ పెయింటింగ్స్ వేసేవాడ్ని. ఇప్పుడు చూస్తున్న పెయింటింగ్‌ల కంటే ఇది పూర్తి భిన్నమైనది. ఇప్పటివరకూ అతివలు, మనదేశ రాష్ట్రపతి, పది మంది సిక్కు గురువుల మీనియేచర్ పెయింటింగ్స్ రూపొందించాను."