ప్రచార జోరు పెంచిన ప్రియాంక వరుస పర్యటనలతో ఉత్తరప్రదేశ్‌ని చుట్టేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. బుధవారం, గురువారం ఆమె కాంగ్రెస్ పార్టీ కంచు కోటలైన అమేఠీ, రాయబరేలీలో ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం అయోధ్యలో పర్యటిస్తారు. శుక్రవారం ఫజియాబాద్- అయోధ్య వెంబడి 50 కిలోమీటర్ల మేర ప్రియాంక రోడ్‌షో నిర్వహణకు ప్రణాళికలు రచించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమయంలో రెండు బహిరంగ సభల్లో ప్రియాంక ప్రసంగించే అవకాశముందని కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి రాజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.
50 కిలోమీటర్ల పాటు సాగే ఈ రోడ్‌షోలో ప్రియాంక సూమారు 30 చోట్ల ఆగి ప్రజలతో సంభాషించనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు.
రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థలాన్ని ప్రియాంక సందర్శిస్తారనే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. అలాగే ఆమె సందర్శించే దేవాలయాలపైనా పార్టీ ప్రకటన చేయలేదు.
నేడు అమేఠీలో ప్రియాంక బూత్ స్థాయి నాయకులతో భేటీ కానున్నారు. తర్వాత అక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయబరేలీ వెళ్తారు.