తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2019, 7:40 AM IST

ETV Bharat / bharat

'ఈశాన్యం'లో అస్తిత్వ పోరు! ముదురుతున్న 'పౌరసత్వ' సంక్షోభం

పౌరసత్వ చట్ట సవరణ ఈశాన్య రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఎందుకు అనిశ్చితి నెలకొంది? ఈ పరిస్థితిని అక్కడ ప్రజలు ముందే గ్రహించారా? ఆ రాష్ట్రాల్లో శాంతి వికసించేదెప్పుడు?

protests in north east states against citizenship amendment bill passage
'ఈశాన్యం'లో అస్తిత్వ పోరు.. ముదురుతున్న 'పౌరసత్వ' సంక్షోభం

పౌరసత్వ చట్ట సవరణ’ను వ్యతిరేకిస్తూ ఈశాన్య ప్రాంత ప్రజలు గడచిన కొంతకాలంగా పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ‘ఈశాన్య’ సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ భారీగా సైనిక దళాలను మోహరించింది. అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో అణచివేతకు, రాజ్య హింసకు గురైన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కట్టబెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ఈశాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సమస్యను పూర్తిగా మత కోణంలో అర్థం చేసుకుని తీసుకువచ్చిన ‘సవరణ’ ఇది! నిజానికి ఈశాన్య ప్రాంతాల్లో మతపరమైన అస్తిత్వానికి పెద్ద విలువ లేదు. భాష, సంస్కృతి, జాతులపరమైన అస్తిత్వాలకే ఈశాన్యంలో పెద్దపీట. ఈ అస్తిత్వాలను కాపాడుకునేందుకు అక్కడి ప్రజలు అహరహమూ తపిస్తారు.

ఈ సంక్లిష్టతలను గుర్తించడంలో ప్రభుత్వాల తడబాటే ప్రస్తుత సంక్షోభానికి కారణం. ఉత్తర భారతంలో హిందూ ముస్లిం అస్తిత్వాల మధ్య విస్పష్టమైన విభజన రేఖ ఉంది. అసోం, మణిపూర్‌, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మత అస్తిత్వానికి ప్రభుత్వ పెద్దలు ఊహిస్తున్నంతటి ప్రాధాన్యం లేదు. ఇప్పటికే వివిధ కారణాలవల్ల తమ భాషా, సాంస్కృతికపరమైన విలక్షణం అస్తిత్వం కొడిగడుతోందని ఈశాన్య ప్రజ కుములుతోంది. ఇప్పటికే కుదేలవుతున్న తమ అస్తిత్వానికి‘పౌరసత్వ చట్ట సవరణ’తో మరింత దెబ్బ తగులుతుందన్నది ‘ఈశాన్యం’ భయం!

అట్టుడికిన ఆగ్రహం

జపాన్‌ ప్రధాని షింజో అబే ఎల్లుండినుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా అసోం రాజధాని గువాహటిలో ప్రధాని మోదీ ఆయనను కలుసుకోవాల్సి ఉంది. కానీ, ఆందోళనకారుల విధ్వంసకాండలో అబే ప్రయాణించే మార్గంలో ఏర్పాటు చేసిన ఓ వేదిక పూర్తిగా నేలమట్టమైంది. పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేనందువల్ల షింజో అబేతో సమావేశాన్ని మరో ప్రాంతానికి మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

దౌత్యపరంగా ఇది దేశ ప్రతిష్ఠను పెంచే పరిణామం కాదు. బంగ్లాదేశ్‌నుంచి తండోపతండాలుగా తరలివస్తున్న శరణార్థులను భరించడం తమ ఒక్కరివల్ల కాదని 1951లో అసోం తొలి ముఖ్యమంత్రి గోపినాథ్‌ బొర్డొలొయ్‌ ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వద్ద మొరపెట్టుకున్నారు. ఆ విషయంపై చర్చకు ఇష్టపడని నెహ్రూ- అసోంకు మొత్తంగా కేంద్ర సాయం నిలిపివేస్తామని గట్టిగా హెచ్చరించారు.

ముందే గ్రహించారు

శరణార్థులు వెల్లువెత్తితే భవిష్యత్తులో తమ అస్తిత్వం సంక్షోభంలో పడుతుందన్న స్పృహ 70ఏళ్ల క్రితమే అసోం నాయకుల్లో ఉండటం విశేషం! అందుకే మరెక్కడా లేని విధంగా దేశంలో కేవలం అసోం రాష్ట్రానికి మాత్రమే జాతీయ జనాభా పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విధానం అమలవుతోంది. ఎన్‌ఆర్‌సీ తీసుకువచ్చినప్పటికీ శరణార్థుల వెల్లువ కొనసాగడంతో 1979లో అసోంలో ఆందోళనలు మిన్నంటాయి. ఆ నేపథ్యంలోనే 1985లో స్థానిక ఉద్యమకారులతో భారత ప్రభుత్వం అసోం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒప్పందం కుదిరి 34 ఏళ్లయినప్పటికీ అందులోని నిబంధనలు కొన్ని ఇప్పటికీ అమల్లోకి రాకపోవడం గమనార్హం.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొంతకాలం క్రితం సుబన్‌సిరి జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. దానివల్ల పర్యావరణం, ప్రకృతి వనరులు, గిరిజనం జీవిక ప్రమాదంలో పడుతుందని స్థానికులు పెద్దయెత్తున ఆందోళన చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. మిజోరం ప్రజలు ఆరో దశాబ్దంలో దారుణమైన కరవు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు- ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అవసరమైన నిధులు కేటాయించి సాయం చేసేందుకు ముందుకు రాలేదు.

శాంతి వికసించేదెప్పుడు?

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిగానా అన్నట్లు ఆ తరవాత మిజో గెరిల్లా యోధుల బృందం పురుడు పోసుకొంది. ‘పౌరసత్వ చట్ట సవరణ’కు వ్యతిరేకంగా నిరుడు మిజోరం మాజీ ముఖ్యమంత్రి ‘హలో చైనా’ అన్న నినాదం రాసి ఉన్న ప్లకార్డును చేతిలో పట్టుకుని వీధుల్లోకి వచ్చారు.

ఆయన చర్య వెనుక ఉద్దేశాలేమిటో ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. భారత ప్రభుత్వంతో దశాబ్దాల పోరాటం తరవాత నాగాల్లోని ఒక వర్గం సర్కారీ ప్రతినిధులతో ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. నిజానికి 22 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, నాగాలు- పరస్పరం ఇచ్చుకున్న హామీలు, ప్రకటించుకున్న భరోసాలు ఎప్పటికప్పుడు గాల్లో కలిసిపోయిన ఫలితమిది.

దేశంలోని ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సాంస్కృతిక, చారిత్రక విలక్షణతలున్నాయి. గుండుగుత్తగా అన్ని సమస్యలకూ ఒకటే మందు అన్నట్లుగా కాకుండా- ఆయా ప్రాంతాల సంక్లిష్టతల మేరకు పరిష్కారాలు అన్వేషించినప్పుడే శాంతి వికసిస్తుంది!

- సంజీబ్​ బారువా

ABOUT THE AUTHOR

...view details