కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసు వెలుగులోకి రావడానికి కారణం ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసు. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోన్న సందర్భంలో ఇదే తరహా అనుమతులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు ఇచ్చినట్లు తేలింది.
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసు...
చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. భారత్‌లోని ఎయిర్‌సెల్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయి. మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్ అనుబంధ సంస్థ 'గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్ లిమిటెడ్' ఈ పెట్టుబడులు పెట్టింది. అయితే ఇందుకు అనుమతులు రావడంలో చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి.
ఆర్థిక మంత్రిగా రూ. 600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతులిచ్చేందకు ఆయనకు అధికారాలు ఉన్నాయి. అయితే ఆయన ఎయిర్‌సెల్‌లోకి మ్యాక్సిస్ నుంచి రూ. 3500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారంటూ సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
రూ. 600 కోట్లు దాటితే ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ పరిశీలనకు పంపించాల్సి ఉన్నా అదేమీ లేకుండా చిదంబరం నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నది ఆరోపణ.
ఐఎన్ఎక్స్ కేసు...
చిదరంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలోనే ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి రూ. 305 కోట్ల విదేశీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా చేరాయన్నది ఆరోపణ. ఇందుకు వీలుగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులివ్వడం వెనుక అవకతవకలున్నాయని అభియోగాలు ఉన్నాయి. ఇందులో ఆయన కుమారుడు కార్తి చిదంబరం ప్రమేయం ఉందని 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది.