ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్.. అధికార దుర్వినియోగం,ఆర్థిక అవకతవకలు ఆరోపణలతో అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గతంలో రాణాకపూర్‌కు విక్రయించిన పెయింటింగ్‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ పెయింటింగ్ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై భాజపా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక నేరానికి గాంధీ కుంటుంబానికి సంబంధాలున్నాయని భాజపా ఆరోపించింది.
ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం
1985లో ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఈ చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ శతాబ్ది వేడుకల సమయంలో రాజీవ్ గాంధీకి బహూకరించారు. ఆ తర్వాత 2010లో దాన్ని రాణాకపూర్ రూ.2 కోట్లు వెచ్చించి ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో రాణా కపూర్‌కు లేఖ రాశారు ప్రయాంక గాంధీ.
ఆ లేఖలో ఏముంది?
"మా నాన్న గారి పెయింటింగ్‌ను కొనుగోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఈ చిత్రపటాన్ని మా నాన్నకు 1985లో కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బహూకరించారు. ప్రస్తుతం ఇది నా స్వాధీనంలో ఉంది" అని లేఖలో పేర్కొన్నారు ప్రియాంక.