ప్రజల సమస్యలు విని, తీర్చే వారే అసలైన జాతీయవాదులని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో అది సాధ్యం కాలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అమేఠీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక.
"ఎన్నికల ప్రధాన సమస్యలు.. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మహిళా భద్రత, విద్య, ఆరోగ్యం. ప్రజల సమస్యలను విని పరిష్కరించటమే జాతీయవాదం. వీళ్ల (భాజపా) పరిస్థితి చూస్తే సమస్యలు వినరు. ప్రజలు సమస్యలను లేవనెత్తి, ప్రశ్నిస్తే బెదిరించాలని చూస్తారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. జాతీయవాదం అంతకన్నా కాదు. డబ్బులు పంచి అమేఠీ ప్రజలను అవమానించారు. మీడియా ముందే చెప్పులు, చీరలు పంచటమనేది తప్పు. ఇలాగేనా ఎన్నికల్లో పోటీ చేసేది? నేను 12 ఏళ్ల నుంచి అమేఠీకి వస్తున్నాను. ఇక్కడి ప్రజలు ఏదీ అభ్యర్థించరు. అమేఠీ, రాయ్‌బరేలీ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ. ప్రజలను ఆదరించేవారే అసలైన జాతీయవాదులు."