చిన్నారి వైద్యానికి.. ప్రియాంక ప్రత్యేక విమానం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోన్న రెండేళ్ల చిన్నారిని అలహాబాద్ నుంచి దిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తీసుకెళ్లేందుకు శుక్రవారం ప్రత్యేక జెట్ విమానాన్ని ఏర్పాటు చేశారు ప్రియాంక. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో రెండేళ్ల పాపకు గత కొద్ది రోజలుగా చికిత్స అందించారు వైద్యులు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, బతికే అవకాశాలు లేవని చెప్పారు.
ప్రయాగ్‌రాజ్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ఈ విషయాన్ని ప్రియాంక దృష్టికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం పాపను దిల్లీలోని ఆసుపత్రికి తరలించేందుకు సాయం అందించాలని కోరారు.
శుక్లా వినతికి వెంటనే స్పందించారు ప్రియాంక. పాపతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రత్యేక జెట్ విమానంలో దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు హార్దిక్ పటేల్, అజారుద్దీన్లు వాళ్లతో పాటు దిల్లీ చేరుకున్నారు. పాపకు వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 'అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు'