తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతా బెనర్జీ కోసం రంగంలోకి ప్రశాంత్​ కిషోర్​! - political statagist

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిషోర్ గురువారం పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కోసం పనిచేయనున్నట్లు సమాచారం.

మమతా బెనర్జీ కోసం రంగంలోకి ప్రశాంత్​ కిషోర్​!

By

Published : Jun 6, 2019, 8:26 PM IST

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం, ఇటీవలి ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల్లో జగన్ పార్టీ అఖండ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బంగకు వెళ్లారు. కోల్‌కతాలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు.

టీఎంసీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ సహా కిషోర్​తో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు దీదీ.

అసెంబ్లీ ఎన్నికల వేళ..

2021లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. టీఎంసీకి వ్యూహకర్తగా పనిచేసేందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రాజకీయ చాణక్యుడిగా పేరున్న ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి సేవలందిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని నిలువరించవచ్చని మమత భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

లోక్​సభ ఎన్నికల్లో ఎదురుగాలి

లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో తృణమూల్​ కాంగ్రెస్​కు భాజపా ముచ్చెమటలు పట్టించింది. 42 స్థానాలకు గాను భాజపా 18 స్థానాల్లో విజయం సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 సీట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్.. ఈసారి 22 స్థానాలకు పరిమితమైంది.

సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో ఉత్సాహంగా ఉన్నారు కాషాయ పార్టీ నాయకులు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్​ కాంగ్రెస్​ను అధికారం నుంచి తప్పించటమే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు.

ఇదీ చూడిండి:బ్రిడ్జ్​ మ్యాన్: పింఛన్​ డబ్బుతో నదిపై వంతెన

ABOUT THE AUTHOR

...view details