తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్ని పదవులు అలంకరించినా ఆ ఒక్కటి అందలేదు!

ప్రణబ్​ ముఖర్జీ... దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, మాజీ రాష్ట్రపతిగా మనకు సుపరిచితమైన దాదాకు రెండు సార్లు ప్రధాని పదవి కొద్దిలో చేజారింది. ఈ విషయం మీకు తెలుసా...?

Pranab
ప్రణబ్​ ముఖర్జీ

By

Published : Aug 31, 2020, 6:50 PM IST

స్వతంత్ర భారత చరిత్రలో సింహభాగం రాజకీయ యవనికపై ప్రణబ్​ ముఖర్జీ ముద్ర ప్రత్యేకం. వివిధ అంశాలపై ఆయనకున్న అవగాహన, అసాధారణ నైపుణ్యం అమోఘం. అందుకే సాధారణ క్లర్క్​ స్థాయి నుంచి ఎదిగి... దేశ అత్యున్నత పదవిని అలంకరించగలిగారు. అలాంటి ప్రణబ్​కు ప్రధాని పదవి మాత్రం అందలేదు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్​ జెండాను భుజాన మోసిన దాదాకు ప్రధాని పదవి రెండుసార్లు అందినట్టే అంది చేజారింది.

ప్రణబ్​ ముఖర్జీ

ఇందిరా మరణానంతరం...

ఇందిరా గాంధీతో ప్రణబ్​ ముఖర్జీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం నిబంధనల ప్రకారం పార్టీలోని సీనియర్​ నేత ప్రధాని పదవి చేపట్టాలి. ఇదే విషయం.. రాజీవ్​​, దాదా మధ్య మనస్పర్థలకు కారణమైంది.

ఇందిర హత్య సమయంలో రాజీవ్​, ప్రణబ్​ బంగాల్​లో ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు. ఆ సమయంలో తాత్కాలిక ప్రధాని ఎవరు అవుతారని రాజీవ్​... ప్రణబ్​ను అడిగారట. 'పార్టీలోని సీనియర్​ నేత ప్రధాని పదవి చేపడతారు. నెహ్రూ, లాల్​బహుదూర్​ శాస్త్రి మరణానంతరమూ అదే జరిగింది' అని ప్రణబ్​ బదులిచ్చారని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన రాజీవ్...​ దాదా హోదా తగ్గించారని వినికిడి. ఈ విధంగా మొదటి సారి కొద్దిలో ప్రణబ్​కు ప్రధాని పదవి దూరమైంది.

ఆర్థిక మంత్రిగా ప్రణబ్
విదేశాంగ మంత్రిగా ప్రణబ్
రాష్ట్రపతిగా ప్రణబ్​ ముఖర్జీ

రాజీవ్​ మరణానంతరం....

రాజీవ్​ దుర్మరణంతో పీవీ నరసింహారావు కాంగ్రెస్​ నాయకత్వ బాధ్యతలు చేపట్టి ప్రధాని అయ్యారు. వాస్తవానికి పీవీ కంటే ప్రణబ్​ ముఖర్జీనే సీనియర్​. అయితే అంతకుముందు పార్టీ వీడి మళ్లీ చేరినందున, పార్టీ సిద్ధాంతాల ప్రకారం సాంకేతికంగా కొత్త నేత అయ్యారు. ఫలితంగా, సీనియార్టీ జాబితాలో వెనుకంజలో నిలిచిపోయారు. ఇలా మరోసారి ప్రధాని పదవి దక్కినట్టే దక్కి చేజారింది.

ప్రణబ్​ ముఖర్జీ

ABOUT THE AUTHOR

...view details