తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భోపాల్​లో డిగ్గీ డీలా.. ప్రజ్ఞాసింగ్​ ప్రభంజనం - భోపాల్

దశాబ్దాలుగా భాజపాకు పెట్టనికోటలా ఉన్న మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడింది. రాజకీయ అనుభవం లేదన్న విమర్శలు, నేరచరిత్ర ఆరోపణలు పక్కనబెడుతూ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ విజయ ఢంకా మోగించారు. హిందుత్వ అంశాలే ప్రధాన అజెండాగా సాగిన ఎన్నికల సమరంలో కాంగ్రెస్‌ దిగ్గజం, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్ పాలనా అనుభవాన్ని కాదని ప్రజ్ఞాసింగ్ వైపే ప్రజలు మొగ్గుచూపారు.

భోపాల్​లో డిగ్గీ డీలా.. ప్రజ్ఞాసింగ్​ ప్రభంజనం

By

Published : May 23, 2019, 5:20 PM IST

కంచుకోటలో కమలం సత్తాచాటింది. దశాబ్దాలుగా భాజపాకు పట్టం కడుతున్న భోపాల్ వాసులు మరోసారి కాషాయ జెండావైపే మొగ్గుచూపారు. సంఘ్‌ పరివార్‌ మద్దతుతో బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు అపూర్వ విజయం అందించారు. నేరచరిత్ర ఉన్నవారిని అభ్యర్థిగా ఎలా నిలబెడతారంటూ సాగిన విమర్శలు, సొంత పార్టీ నేతల అసంతృప్తిని పటాపంచలు చేస్తూ.. ప్రజ్ఞాసింగ్ విజయఢంకా మోగించారు.

సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి...

కరడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన ప్రజ్ఞాసింగ్ 14ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించారు. చరిత్రలో ఎంఏ పూర్తయ్యేనాటికి ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా మారారు. 2008 మాలేగావ్‌లో బాంబు పేలుళ్లతో సంబంధం ఉందన్న ఆరోపణలపై చాలాకాలంగా జైలు జీవితం గడిపారు. 2017లో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు జీవితంలోనే కేన్సర్‌తోనూ పోరాడి గెలిచారు ప్రజ్ఞా. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ప్రజ్ఞాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటించినా.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమె విచారణ ఎదురొంటున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఉమాభారతి వంటి సీనియర్లు పోటీకి విముఖత చూపిన నేపథ్యంలో.. హిందూ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో వ్యూహాత్మకంగా సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ను బరిలోకి దింపింది భాజపా అధిష్ఠానం.

అధిష్ఠానం సూచనలతో..

భోపాల్ నియోజకవర్గంలో భాజపాకు ఉన్న సంస్థాగత నిర్మాణం, క్యాడర్‌, దశాబ్దాల తరబడి అక్కడి ఓటర్లకు భాజపా పట్ల ఉన్న విశ్వాసం ప్రజ్ఞాసింగ్ విజయానికి దోహదపడిందని చెప్పాలి. ఆరెస్సెస్, భజరంగ్‌ దళ్, దుర్గావాహిని, ఏబీవీపీ కార్యకర్తలు భారీగా ప్రచారంలో పాల్గొన్నారు. దిల్లీలోని పార్టీ అధిష్ఠానం ఆమె ప్రచారంపై దృష్టిసారించి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ సాధ్వి విజయానికి కృషి చేసింది.

హిందుత్వమే ప్రధాన అజెండా..

యూపీఏ హయాంలో కేసుల పేరుతో పోలీసులు వేధించారంటూ ప్రజ్ఞాసింగ్ చేసిన ప్రచారాన్ని భోపాల్ ప్రజలు విశ్వసించారన్నది పరిశీలకుల మాట. హిందుత్వమే ప్రధాన అజెండాగా సాధ్వి ప్రజ్ఞాసింగ్ చేసిన ప్రచారం కూడా ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా పడేలా చేసిందని చెప్పొచ్చు. బాబ్రీ మసీదు ఘటన, ముంబయి పోలీసు అధికారి హేమంత్‌ కర్కరే మరణం అంశాల్లో ప్రజ్ఞా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దిగ్విజయ్‌ సింగ్‌ను హిందూ వ్యతిరేకవాదిగా ఆరోపిస్తూ ఆమె సాగించిన ప్రచారం లాభించిందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.

1989 నుంచి భాజపానే...

భోపాల్‌లో 1989 నుంచి వరుసగా గెలుచుకుంటూ వస్తోంది భాజపా. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం.. 1984లో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాల కారణంగా భాజపా ఓటమి చవిచూసింది. తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సుశీల్‌ చంద్ర వర్మ విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. ఈ నియోజకవర్గంలో భాజపాకు ఓటమే లేదు. మోదీ ప్రభంజనం వీచిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పీసీ శర్మపై భాజపా అభ్యర్థి అలోక్‌ సంజార్‌ 3 లక్షల 70 వేల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ సంప్రదాయం కొనసాగిస్తూ తాజా ఎన్నికల్లో డిగ్గీ రాజాకు షాకిస్తూ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ విజయం సాధించారు.

ఇదీ చూడండి:తీర్పు 2019: భాజపా విజయానికి పది కారణాలు

ABOUT THE AUTHOR

...view details