దేశ విభజనకు కారణమైన బుజ్జగింపు రాజకీయాలే ముమ్మారు తలాక్ దురాచారం ఏళ్ల తరబడి కొనసాగడానికీ కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దిల్లీలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముమ్మారు తలాక్‌పై చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2014లో ప్రధానిగా మోదీ విజయం.. బుజ్జగింపు రాజకీయాలను తరిమికొట్టేందుకు నాంది పలికిందన్నారు.
"ముమ్మారు తలాక్ దురాచారాన్ని నిర్మూలిస్తే ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తమైంది? దీని వెనక బుజ్జగింపు రాజకీయాల పాత్ర చాలా ఉంది. స్వాతంత్ర్యానికి ముందు.. దేశాన్ని విభజన నుంచి కాపాడేందుకు ప్రారంభమైన బుజ్జగింపు రాజకీయాలే భారత విభజనకు కారణమయ్యాయి. ఓటుబ్యాంకు పెంచుకునేందుకు ఓ ఉపాయంగా మారింది. ఓటుబ్యాంకు ఆధారంగా అధికారాన్ని కాపాడుకోవడం, తిరిగి అధికారంలోకి రావడం, ఏళ్ల తరబడి అధికారంలో ఉండడం....కొన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. బుజ్జగింపు రాజకీయాలు ఈ దేశాన్ని చాలా విధాలుగా ధ్వంసం చేశాయి."