అసోంలో పోలీసులు, స్థానికులకు మధ్య తలెత్తిన గొడవలో... ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బాంగైగాన్ జిల్లాలోని ఓ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. మాంసం విక్రయ కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కరోనా నేపథ్యంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇరు వర్గాల ఘర్షణలో ఎవరికీ గాయాలు కాలేదు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అదనపు బలగాలను మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మోహరించారు.