ఒడిశాలోని ఫొని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ నేడు పరిశీలించనున్నారు. తుపాను ధాటికి దెబ్బతిన్న పూరీ, కుర్దా, కటక్, జాజ్పుర్, కేంద్రపారా సహా పలు జిల్లాల్లో విహంగ వీక్షణం ద్వారా వాస్తవిక స్థితిని తెలుసుకోనున్నారు.
'ఫొని' ప్రభావిత జిల్లాల్లో నేడు మోదీ పర్యటన
ఒడిశాలోని ఫొని తుపాను ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నాక పూరీ, కుర్దా, కటక్. జాజ్పుర్, కేంద్రపారా సహా పలు జిల్లాల్లో విహంగ వీక్షణం చేయనున్నారు.
విహంగ వీక్షణం అనంతరం పునరావాస, పునరుద్ధరణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో విమానాశ్రయంలోనే చర్చించనున్నారు మోదీ. ఇప్పటికే ఒడిశా గవర్నర్, ముఖ్యమంత్రితో ఫోన్లో సంభాషించారు ప్రధాని. కేంద్ర తరఫున అన్ని విధాలా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫొని ధాటికి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వందాలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వేల సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలాయి. గత కొన్ని ఏళ్లుగా వచ్చిన తుపానుల్లో ఫొని అత్యంత ప్రమాదకర తుపానని వాతావరణశాఖ ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించింది.
- ఇదీ చూడండి: ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక