పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల దేశంలో ఓ ఒక్క పౌరునికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మైనారిటీల ప్రయోజనాలకు నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్, వామపక్షాలే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ నేతలే ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు మోదీ.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంగా లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రధాని. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏడు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించిందన్నారు మోదీ.
"మీరు అనుసరించిన పద్ధతులను మేమూ అనుసరించి ఉంటే, మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే.. 70ఏళ్ల తర్వాత కూడా ఆర్టికల్ 370 రద్దు జరిగి ఉండేది కాదు. మీ ఆలోచనా విధానాలతోనే మేమూ ముందుకు వెళ్లుంటే.. 'ముమ్మారు తలాక్' కత్తి నుంచి ముస్లిం మహిళలకు ఉపశమనం లభించేది కాదు. మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే... అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా చట్టం వచ్చేది కాదు. మీ ఆలోచనలతోనే నడిచి ఉంటే.. రామ జన్మభూమి ఇప్పటికీ వివాదాల్లోనే ఉండేది. మీలాగే మేమూ ఆలోచించి ఉంటే.. కర్తార్‌పుర్ నడవా వచ్చేదే కాదు. మీరు ఎంచుకున్న పద్ధతులనే మేమూ అనుసరించి ఉంటే భారత్-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం దక్కేది కాదు.
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రాహుల్‌పై ట్యాబ్లైట్ పంచ్..
ఓవైపు భాజపా చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు మోదీ. పలు సందర్భాల్లో విపక్ష నేతలనుద్దేశించి ఛలోక్తులు విసిరారు.