అసోంలోని టిన్సుకియా జిల్లాలో చమురు బావిలో మంటలు చెలరేగిన ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేలా సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా గతంలో జరిగిన ప్రమాదాలపై జాబితా రూపొందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను ఆదేశించారు మోదీ. వాటి ద్వారా నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయని తెలిపారు.
" భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించటం, అవి సంభవించినప్పుడు ఎదుర్కోవటానికి మన సొంత సంస్థల్లో ఆ సామర్థ్యాలు, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. చమురు బావి ప్రమాదంతో ప్రభావితమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం సహా అన్ని విధాల కేంద్రం అండగా ఉంటుంది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఆయిల్ ఇండియాకు చెందిన బాఘ్జన్-5 చమురు బావిలో చెలరేగిన మంటలు అదుపు చేసేందుకు భారత్, విదేశీ నిపుణులు రచించిన ప్రణాళికను ప్రధానికి వివరించారు అధికారులు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న క్రమంలో జూన్ 7 నాటికి బావి నుంచి గ్యాస్ లీకేజీని పూర్తిగా నియంత్రించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సహా పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
10 రోజులకుపైగా..
ఆయిల్ ఇండియాకు చెందిన బాఘ్జన్-5 చమురు బావిలో మే 27నే గ్యాస్ లీకేజీ ప్రారంభమైంది. దానిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే జూన్ 9న మంటలు అంటుకున్నాయి. పది రోజులకుపైగా జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వాటిని నియంత్రించేదుకు విదేశీ నిపుణులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు 9వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1,610 కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కోకుటుంబానికి రూ. 30వేలు అందించారు.
ఇదీ చూడండి: అదుపులోకి రాని మంటలు.. 7 వేల మంది తరలింపు