2015 నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 58 దేశాల్లో పర్యటించినట్లు కేంద్రం తెలిపింది. ఈ పర్యటనలకు రూ.517.18 కోట్ల వ్యయం అయినట్లు రాజ్యసభకు వెల్లడించింది.
మోదీ చేపట్టిన పర్యటనలు, వాటి ఫలితాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
చైనాకు ఐదు సార్లు
మురళీధరన్ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా, రష్యా, చైనా దేశాలకు ప్రధాని ఐదేసి సార్లు పయనమయ్యారు. సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, యూఏఈ వంటి దేశాలకు ఒకటికంటే ఎక్కువసార్లు వెళ్లారు. ఆయా పర్యటనల్లో భాగంగా కొన్ని సార్లు ఒకటికి మించి దేశాలను చుట్టిరాగా.. మరికొన్నిసార్లు ద్వైపాక్షిక సందర్శనలు చేశారు. చివరిసారిగా మోదీ.. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో హాజరయ్యేందుకు బ్రెజిల్‌కు వెళ్లారు. 2019 నవంబర్ 13-14 మధ్య ఈ పర్యటన నిర్వహించారు.
పర్యటనల ఫలితాలు
ప్రాంతీయ, అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాల్లో భారత దృక్పథాన్ని మోదీ పర్యటనలో భాగంగా ఆయా దేశాలు అర్థం చేసుకున్నాయని మురళీధరన్ వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ రంగ సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఆయా దేశాలతో భారత సంబంధాలు పెంపొందించడానికి ప్రధాని పర్యటనలు దోహదం చేశాయని చెప్పారు.
"ప్రధాని పర్యటనలు భారతదేశ అభివృద్ధి అజెండాకు దోహదపడ్డాయి. ప్రజల ఆర్థికాభివృద్ధి, శ్రేయస్సు పెంపొందించేందుకు ఉపయోగపడ్డాయి. ఫలితంగా బహుపాక్షిక వేదికల్లో ప్రపంచస్థాయి అజెండాను రూపొందించడంలో భారత్ మరింత సహకారం అందిస్తోంది"