మోదీ యూపీ పర్యటన... 'నమామి గంగే' ప్రాజెక్టుపై సమీక్ష 'నమామి గంగే' పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయనున్నారు. పవిత్ర గంగా నదిలో ప్రయాణించడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేయనున్నారు మోదీ.
గంగా మండలి సమావేశం...
శనివారం గంగా మండలి సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని. కొందరు కేంద్ర మంత్రులు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు.
అయితే మరో రెండు గంగా పరీవాహక రాష్ట్రాలైన పశ్చిమ్ బంగ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొనడంపై స్పష్టత లేదు. ఝార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నారు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుపైనా అనుమానాలు నెలకొన్నాయి.
గంగా కౌన్సిల్ సమావేశం అనంతరం పథకం అమలును అంచనా వేయటానికి ప్రధాని మోదీ కాన్పుర్ వద్ద గంగానదిలో స్వయంగా ప్రయాణించనున్నారు.
భాజపా ప్రతిప్టాత్మక ప్రాజెక్టు...
గంగా ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంగే’ పథకం గత కొద్ది సంవత్సరాలుగా ఆశించినంతగా సఫలం కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైన అనంతరం... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నమామి గంగే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్టు భాజపా వర్గాలు సమాచారం.