ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి లఘు వ్యాపారిక్ మాన్‌ధన్ యోజన, స్వరోజ్‌గార్ పింఛను పథకాలను నేడు ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ పర్యటించనున్నారు. ఝార్ఖండ్ అసెంబ్లీ కొత్త భవనాన్ని కూడా ప్రారంభిస్తారు మోదీ. దేశ వ్యాప్తంగా 462 ఏకలవ్య మోడల్ స్కూల్స్‌కు ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్, ఆ రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన.. రైతులకు సామాజిక భద్రతను కల్పించనుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు ఈ పథకం కింద పేరు నమోదు చేసుకోవచ్చు. 60 ఏళ్ల వయస్సు వచ్చాక వారికి నెలకు 3 వేల రూపాయల చొప్పున పెన్షన్ లభిస్తుంది. ఇప్పటికే ఈ పథకం కింద ఝార్ఖండ్‌లో లక్షా 16 వేల 183 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు.