కరోనా ప్రమాదం ఇప్పటికీ ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. మాస్కులు ధరించి, వ్యక్తిగత దూరం పాటించడంలో అలసత్వం ఉండకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ పోరులో తప్పక విజయం సాధిస్తామని మోదీ పునరుద్ఘాటించారు.
కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ బాలాసాహెబ్ వీఖే పాటిల్ ఆత్మకథ ఆవిష్కరణ సభలో మోదీ వర్చువల్గా పాల్కొన్నారు. ఈ కార్యక్రమంలో.. 'ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ' పేరును 'డా. బాలాసాహెబ్ వీఖే పాటిల్ ప్రవర రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ'గా మార్పు చేశారు.
'అభివృద్ధికి ఆయన జీవితం అంకితం'
పాటిల్ ఆత్మకథ ఇప్పుడు విడుదలైనప్పటికీ.. ఆయన గురించి మహారాష్ట్రలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు మోదీ. మహారాష్ట్ర అభివృద్ధికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని కీర్తించారు.