ఐక్యరాజ్యసమితి(ఐరాస) సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అత్యున్నతస్థాయి సమావేశంలో మాట్లాడే వారి జాబితాను ఐరాస విడుదల చేసింది. సెప్టంబర్ 26న ప్రధాని ప్రసంగం ఉన్నట్లు అందులో పేర్కొంది.
అయితే ఈ జాబితా తాత్కాలికమైనదని అధికార వర్గాలు తెలిపాయి. మరికొద్ది రోజుల్లో ఈ జాబితా రెండుసార్లు సవరించే అవకాశం ఉందని వెల్లడించాయి.
ట్రంప్ ఒకే ఒక్కడు!
ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో తొలిసారి వార్షిక సాధారణ సమావేశాల్ని వర్చువల్‌గా నిర్వహించనున్నారు. దేశాధినేతలు ఎవరూ ఈ సమావేశానికి నేరుగా హాజరు కావడం లేదు. న్యూయార్క్‌లో జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే నేరుగా హాజరయ్యే అవకాశం ఉంది. మిగిలిన దేశాధినేతలు... ముందుగానే రికార్డు చేసిన వీడియో సందేశాన్ని ఐక్యరాజ్యసమితికి అందించనున్నారు.
తొలి ప్రసంగం ఆయనదే..
సెప్టంబర్ 22న ప్రారంభం కానున్న ఈ సమావేశాలు సెప్టెంబర్ 29 వరకు కొనసాగుతాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సోనారో తొలి ప్రసంగం చేస్తారు. ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు ఈ సమావేశంలో రెండో ప్రసంగం ఇస్తారు. అధ్యక్షుడు ట్రంప్ న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయానికి వెళ్లి సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా తన తొలి పాలనా కాలంలో సాధారణ సభకు ట్రంప్ ఇచ్చే చివరి సందేశం ఇదే కానుంది.