తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు - జీ-7

జీ-7 దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ పలువురు అంతర్జాతీయ నేతలతో భేటీ అయ్యారు. జీ-7 దేశాల్లో సభ్యత్వం లేనప్పటికీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సదస్సుకు హాజరుకానున్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్​పై సదస్సులో ప్రసంగించనున్నారు.

జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు

By

Published : Aug 26, 2019, 5:06 AM IST

Updated : Sep 28, 2019, 7:00 AM IST

జీ-7 సదస్సు: ప్రపంచ అగ్రనేతలతో మోదీ చర్చలు

జీ-7 సమావేశాల్లో భాగంగా వివిధ అంతర్జాతీయ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అంతర్జాతీయ సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఫ్రాన్స్​​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఇప్పటికే మోదీ బియారిట్జ్​ చేరుకున్నారు. జీ-7 సదస్సు జరగనున్న డూ పాలాయిస్​ హోటల్​కు చేరుకున్న మోదీకి మెక్రాన్​ సాదర స్వాగతం పలికారు.

గుటెరెస్​తో భేటీ...

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే సదస్సుకు హాజరవడం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అనంతరం జరిగిన భేటీ కావడం వల్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాల్సిందిగా పాక్ చేసిన అభ్యర్థనను గుటెరస్ తోసిపుచ్చారు. కశ్మీర్ అంశంలో సిమ్లా ఒప్పందం మేరకు మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశం లేదని ఇటీవల స్పష్టం చేశారు.

బ్రిటన్​ ప్రధానితో...

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో సమావేశమైన ప్రధాని మోదీ పలు కీలక అంశాలలో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇరువురు నేతలు తొలిసారి భేటీ అయ్యారు.

వాణిజ్యం,పెట్టుబడులు రక్షణ, విద్య, శాస్త్రసాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. యాషెస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందడంపై బ్రిటీష్ ప్రధానికి మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి. రవీష్ కుమార్ ట్వీట్ చేశారు.

ట్రంప్​తో కశ్మీర్​పై..!

ఇవాళ మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మోదీ సమావేశం కానున్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్‌ వైఖరి, వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం నెలకొంటుందన్న ఆందోళనల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ఆపాలని మిత్రదేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరాయి. ఈ నేపథ్యంలో చైనాతో వాణిజ్య యుద్ధంపై విచారం వ్యక్తం చేశారు.

Last Updated : Sep 28, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details