దేశ ప్రజలందరూ ఆరోగ్యం వైపు అడుగులేయాలనే ఉద్దేశంతో.. ఫిట్ ఇండియా ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని.. దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆగ్యకరమైన దేశ భవిష్యత్తుకు ఫిట్ ఇండియా ఉద్యమం దోహదపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ... మహోన్నత క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం, క్రీడలు భాగం కావాలిని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆరోగ్యకర సమాజంతోనే శ్రేష్ఠ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు ప్రధాని.
"ఆరోగ్య భారత్ కోసం అందరూ ముందుకు రావాలి. శారీరక దృఢత్వ ప్రాముఖ్యతను యువతరం గుర్తించాలి. విశ్వవేదికపై భారత్ క్రీడాకారులు వెలుగొందుతున్నారు. ఫిట్‌నెస్ ఆవశ్యకతపై వీడియో రూపొందించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిద్దాం. ఫిట్‌నెస్ కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిద్దాం. వారివారి క్రీడల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహిద్దాం. ఫిట్‌నెస్ అనేది ప్రతిఒక్కరి జీవన విధానం కావాలి. కొంతమంది ఫోన్లు, చేతి గడియారాల ద్వారా ఎన్ని అడుగులు వేశారో లెక్కిస్తున్నారు. ఎంత వ్యాయామం, ఫిట్‌నెస్ వచ్చిందో చూసుకోవాలి. కొంతమంది ఉత్సాహంగా ఫిట్‌నెస్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ, ఆ తర్వాత యాప్‌లు తెరిచి చూడట్లేదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి