'స.హ చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలు!' సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా గుర్తించేలా ఆదేశాలివ్వాలని అందులో కోరారు.
భారతీయ జనతా పార్టీ నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
" ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ ప్రకారం విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదించాల్సిన అవసరం ఉంది. ఇది వారి పౌరసంబంధాల బాధ్యతను సూచిస్తుంది. అందువల్ల సమాచార హక్కు చట్టం 2005, సెక్షన్ 2(హెచ్) ప్రకారం పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా కోర్టు గుర్తించాలి. "
- అశ్విని ఉపాధ్యాయ్, న్యాయవాది
రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించటం, నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం వంటివి.. పార్టీలు ప్రభుత్వ ఆస్తులేనని సూచిస్తోందని వ్యాజ్యంలో పేర్కొన్నారు అశ్విని. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు నాలుగు వారాల్లో సమాచార అధికారులు, అప్పిలేట్ సంస్థలను నియమించుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. సమాచార హక్కు దరఖాస్తులపై స్పందించాలన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, సహ చట్టం, ఆదాయ పన్ను చట్టం, ఎన్నికల నియమావళి నిబంధనలను పాటించని పార్టీలను ఎన్నికల సంఘం గుర్తింపు రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా ఉచిత, తక్కువ ధరకే వసతి కల్పిస్తున్నాయని తెలిపారు. అది వారి పరోక్ష పెట్టుబడిని సూచిస్తోందని చెప్పారు. దూరదర్శన్ ఉచిత ప్రసారాలు కల్పిస్తోందని తెలిపారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నందున రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్ను విచారించడంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.