పట్టణ ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యల్లో చెత్త ఒకటి. చెత్తను నిల్వ చేస్తే దుర్వాసన వస్తుంది. అలా అని ఎక్కడ పడితే అక్కడ పడేయలేని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట సమస్యకు వినూత్న పరిష్కారాన్ని చూపారు కర్ణాటక తుమకూరు జిల్లా ప్రజలు. అదే 'పైప్ కంపోస్ట్ ప్రాజెక్ట్'. ఈ విధానంతో ఇంట్లో నుంచి వెలువడే చెత్త, వ్యర్థాలతోనే స్వచ్ఛమైన ఎరువును తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క తుమకూరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే దాదాపు 3వేలకు పైగా ఇళ్లలో ఈ విధానం అమలవుతోంది.
వ్యర్థాలతో ఎరువు ఎలా ?
ముందుగా ఒక పైపును తీసుకుని, ఒకటిన్నర అడుగు మేర తోటలో కానీ మొక్కలు ఉన్న ప్రదేశంలో కానీ పూడ్చి పెట్టాలి. ఆ గొట్టం చుట్టూ రంధ్రాలు చేయాలి. తర్వాత రోజూ ఇంట్లో వెలువడే చెత్త, వ్యర్థాలను పైపులో వేయాలి. కొంత పేడ కానీ మట్టి కానీ వారానికి ఒకసారి ఆ గొట్టంలో పడేయాలి. ఇలా చేయటం వల్ల రసాయనిక చర్య జరిగి ఎరువు తయారవుతుంది.