దేశంలో దాదాపుగా 18 వందలకు పైగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్టీల పేర్లు, గుర్తులపై దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పార్టీల పేర్లు మతాలకు సంబంధించినవి గానీ, జాతీయ జెండాను పోలిన గుర్తులు గానీ ఉన్నట్లయితే మూడు నెలల్లో తొలగించాలని పిటిషనర్ కోరారు. అలా చేయకుంటే పార్టీల గుర్తింపు రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ మేనన్, జస్టిస్ ఏజే భంభానిల ధర్మాసనం భాజపా నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. పిటిషనర్ అభ్యర్థనపై వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
పిటిషన్ను తోసిపుచ్చింది ఎన్నికల సంఘం. వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలన్నీ పోల్ ప్యానల్ ఇప్పటికే పరిష్కరించిందని తెలిపింది.
ఎన్నికల సంఘం వ్యాఖ్యలపై స్పందించిన న్యాయస్థానం ఏ విధంగా పరిశీలిస్తారో చూడాలని పేర్కొంది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.