గణతంత్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. దిల్లీ నుంచి గల్లీ వరకు జాతీయ జెండాలను ఎగురవేసి భారతీయులంతా దేశభక్తిని చాటుకున్నారు. అయితే జెండా పండుగ కోసం తానే మువ్వన్నెల జెండాగా మారాడు ఓ యువకుడు. వైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన చేసిన అద్భుతానికి యావత్ దేశం సలాం అంటోంది.
'వాట్సాప్ వండర్‌బాక్స్' పేరుతో అనేక స్ఫూర్తిమంతమైన, సృజనాత్మక వీడియోలు పోస్ట్ చేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం ఉదయం కూడా ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో రెండు కాళ్లు లేని ఓ దివ్యాంగుడు జాతీయ జెండా రంగులతో ఉన్న చొక్కా ధరించి జెండా కర్రను సునాయసంగా ఎక్కాడు. కర్ర చివరి వరకు వెళ్లి జెండా రెపరెపలాడుతున్నట్లుగా వేలాడాడు. ఎందరికో స్ఫూర్తి కలిగిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయ్యండి...