శీతాకాలం ప్రారంభంలోనే దేశరాజధాని దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వాయు కాలుష్యం కారణంగా ప్రజల ఆయువు క్షీణిస్తోందని వెల్లడించింది. కాలుష్యాన్ని నియంత్రించటంలో అధికారులు విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం దిల్లీ వాయు కాలుష్యంపై విచారణ చేపట్టింది. ఐఐటీకి చెందినవారు సహా వాతావరణ నిపుణులను అరగంటలోగా హాజరయ్యేలా చూడాలని కేంద్రాన్ని ఆదేశించింది.
'జీవనం సాధ్యమేనా'
ఈ వాతావరణంలో ప్రజలు జీవనం సాగించగలరా?.. అంటూ ప్రశ్నించింది కోర్టు. మనం ఇలాంటి వాతావరణంలో బతకలేమని పేర్కొంది. అధికారులు వాయుకాలుష్యానికి ప్రజలను బలిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. వాయుకాలుష్యానికి రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టీకరించింది.
"వాయు కాలుష్యంతో దేశ రాజధాని దిల్లీ ఏటా ఉక్కిరిబిక్కిరవుతుంది. కానీ మనం దీని నియంత్రణకు ఏమీ చేయలేకపోతున్నాం. భారత్ లాంటి నాగరిక దేశంలో ఇలాంటి వాతావరణం ఉండటం విషాదకరం. వ్యవసాయ వ్యర్థాలను ఏటా తగలబెట్టడం ఎందుకు?.. ప్రతిసారీ ఇదే విధంగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం. రాష్ట్రాలకు ఈ విషయం తెలుసు కానీ ఏమీ చేయడం లేదు."
-విచారణ సందర్భంగా సుప్రీం.