"నిబంధనలన్నీ సామాన్యులకేనా...? రాజకీయ నేతలకు ఉండవా...?"... తరచూ వినిపించే డైలాగ్ ఇది. ఈ ప్రశ్న మరోమారు గట్టిగా వినిపిస్తోంది. నెట్టింట ఓ ఉద్యమమే నడుస్తోంది.
ఆన్లైన్ ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ ఒక్కటే... రాజకీయ నేతలకు ట్రాఫిక్ చలానాలు ఇవ్వాలని. ముఖ్యంగా... కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వారు గురిపెట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ ఇద్దరికీ జరిమానా విధించాలని డిమాండ్ చేస్తూ 'ఛేంజ్ డాట్ ఓఆర్జీ'లో ఆన్లైన్ ఉద్యమం మొదలుపెట్టారు.
ఇదీ విషయం...
మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల్ని ఇటీవలే కఠినతరం చేసింది కేంద్రం. ఈనెల 1 నుంచి జరిమానాల బాదుడు మొదలైంది. హరియాణా గురుగ్రామ్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59వేలు ఫైన్ పడింది. భువనేశ్వర్‌లో ఓ ఆటో డ్రైవర్‌కు రూ.47,500 జరిమానా వేశారు అధికారులు. దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
ఈ వార్తల నేపథ్యంలో కొన్ని పాత ఫొటోలను బయటకు తీశారు నెటిజన్లు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పుర్‌లో హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతున్న ఫొటో వాటిలో ముఖ్యమైంది. మహారాష్ట్ర డీజీపీని ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఆ ఫొటో పోస్ట్ చేశారు కొందరు ఔత్సాహికులు. ఆయనకు ఫైన్ వేయరా అని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ 'ఛేంజ్ డాట్ ఓఆర్జీ'లో పిటిషన్ వేశారు. వందలాది మంది ఇప్పటికే ఆ పిటిషన్‌కు మద్దతు తెలిపారు.
రాహుల్ వంతు...
గడ్కరీ స్కూటర్ ఫొటోతోపాటు మరో ఛాయాచిత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీది. ద్విచక్రవాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ కనిపించారాయన.