అయోధ్య భూవివాదానికి సంబంధించి తొలిసారి ఓ రాజకీయ పార్టీ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసింది. సున్నితమైన రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో 2019 నవంబర్ 9న ధర్మాసనం వెలువరించిన చారిత్రక తీర్పును సవాల్ చేస్తూ 'పీస్ పార్టీ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు మహ్మద్ ఆయుబ్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పని వాదించారు మహ్మద్. వివాదాస్పద స్థలాన్ని జప్తు చేసేంతవరకు న్యాయపరంగా ఆ ప్రాంతం ముస్లింల అధీనంలోనే ఉందన్నారు. పూర్తిగా స్వాధీనంలో ఉన్న అంశాల ఆధారంగానే యాజమాన్య హక్కులు కట్టబెట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. కానీ వివాదాస్పద స్థల ప్రాంగణంలో హిందువులకు ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. వివాదాస్పద స్థలంలో ఉన్న కేవలం ఓ ఆకృతిని ఆధారంగా చేసుకొని యాజమాన్య హక్కులు ఇవ్వకూడదని ఆరోపించారు.
ఆధారాల్లేవ్..
మరోవైపు 1949కి ముందు సెంట్రల్ డోమ్ కింద ఉన్న ప్రాంతాన్ని రాముడి జన్మస్థలంగా భావిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లో వెల్లడించారు. అసలు సెంట్రల్ డోమ్ కింద రామ్ చబుత్రా కానీ మరే ఇతర విగ్రహాలు కానీ 1949 డిసెంబర్‌కు ముందు ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు.