జవాన్లకు కొన్నిసార్లు ఆహారం లేకపోయినా దేశ రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తారని తెలిపారు సైనికాధిపతి బిపిన్ రావత్. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లయిన సందర్భంగా జమ్ముకశ్మీర్ ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధస్మారకం వద్ద జ్యోతి వెలిగించి నివాళులర్పించారు.
'పరాభవం తప్పదు'
మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే పరాభవం తప్పదని దాయాది పాక్‌కు పరోక్ష హెచ్చరికలు చేశారు బిపిన్ రావత్. సైన్యానికి అధునాతన ఆయుధాలు సమకూర్చేందుకు యత్నిస్తున్నామని స్పష్టం చేశారు. 2020 కల్లా హవిట్జర్లను సైన్యంలో ప్రవేశపెడతామని, కే-9 క్షిపణులను దేశంలో తయారు చేస్తున్నామని వెల్లడించారు. బోఫోర్స్‌ను పోలిన శతఘ్నులు రెండింటిని దేశీయంగా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
'వాజ్‌పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'
"సైన్యం కార్గిల్ యుద్ధంలో చారిత్రక విజయం సాధించి 20 ఏళ్లు. ఈ యుద్ధంలో చొరబాటుకు దుస్సాహసం చేసిన పాకిస్థానీలను వెనక్కి పంపించాం. కార్గిల్ సహా ద్రాస్,ఆలేఖ్ నుంచి సుఖ్ వరకు దురాక్రమించేందుకు యత్నించిన వారిని విజయవంతంగా తిప్పికొట్టాం. దురాక్రమణదారులను వెనక్కి తరమాలని సైన్యానికి ఆదేశిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఆయన చొరబాటుదారులను వెనక్కి పంపించాలని తెలిపారు. యుద్ధ రంగంలోకి వెళ్లకముందే విజయం మనదే అని వ్యాఖ్యానించారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు. లక్ష్యం ఎంత పెద్దదైనా, క్లిష్టమైనా సైన్యం చేసి చూపిస్తుంది. సరిహద్దును కాపాడుతుంది. దేశ ప్రజలందరు సురక్షితంగా నిద్రపోయేలా కాపాలా కాస్తుంది. సైనికులకు ప్రోత్సాహం కలిగించేలా దేశ ప్రజల నుంచి మద్దతు ఉంటే చాలు."
-బిపిన్ రావత్, సైనికాధిపతి
ఇదీ చూడండి: ఈ సా.6గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం!