తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: బలపరీక్షపై వ్యూహ ప్రతివ్యూహాలు

కర్ణాటక విధానసభలో బలపరీక్ష సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. భాజపా అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. ఈ సమావేశంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాల్ని రచించనున్నారు.

By

Published : Jul 21, 2019, 8:28 AM IST

బలపరీక్షపై వ్యూహ ప్రతివ్యూహాలు

సోమవారం జరగనున్న బలపరీక్షతో కుమారస్వామి నేతృత్వంలోని అధికార కూటమి భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో శాసనసభలోని పార్టీలన్నీ వ్యూహాలు రచించడంలో మునిగితేలుతున్నాయి.

సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సమావేశాల్లో తలమునకలయ్యాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కాంగ్రెస్ శాసనసభా పక్షం.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో నేటి సాయంత్రం భేటీ కానుంది. ముంబయిలో ఉన్న ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకువచ్చేందుకు కూటమి నేతలు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం బలపరీక్షలో నెగ్గుతామని విశ్వాసం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్. రాజీనామా చేసి ఉపసంహరించుకున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి... జేడీఎస్ దళపతి దేవెగౌడతో సమావేశం కావడం తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయనడానికి నిదర్శనంగా కన్పిస్తోంది.

తాజా పరిణామాలపై గవర్నర్

బలపరీక్ష ఎదుర్కోవాలని తాను రెండు సార్లు చేసిన ఆదేశాలను సంకీర్ణ కూటమి ప్రభుత్వం ధిక్కరించిందని గవర్నర్ వాజుభాయివాలా ఓ ముఖాముఖిలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు రాజకీయాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ఆదేశాల ధిక్కరణపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

చర్చ ద్వారా సమయం వృథా: యడ్డీ

గవర్నర్ ఆదేశాలను అమలు చేయకుండా చర్చ పేరుతో సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప. వారికి మెజారిటీ లేకపోయినప్పటికీ సమయాన్ని వృథా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మెజారిటీ నిరూపించుకోవాలని, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ద్వారా సోమవారం ఉపశమనం కలుగుతుందనే భ్రమల్లో కూటమి నేతలు ఉన్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: నేడు సోన్​భద్ర బాధితులను కలవనున్న సీఎం యోగి

ABOUT THE AUTHOR

...view details