తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బడ్జెట్​ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం - పార్లమెంట్

2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర లభించింది. జులై 18నే లోక్​సభ ఆమోదం పొందగా, నేడు రాజ్యసభ గడప దాటింది. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం లభించింది.

బడ్జెట్​ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

By

Published : Jul 23, 2019, 7:19 PM IST

మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్​ బిల్లు నేడు రాజ్యసభ ఆమోదం పొందింది. జులై 18న లోక్​సభలో నెగ్గిన బడ్జెట్​ బిల్లు నేడు పార్లమెంట్ గడప దాటి రాష్ట్రపతి వద్దకు చేరింది. ​బడ్జెట్​పై చర్చ సందర్భంగా సమ్మిళిత అభివృద్ధే నూతన పన్ను విధాన లక్ష్యమని ఉద్ఘాటించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.

పెట్రోల్, డీజిల్​పై పన్నును లీటరుకు రూ. 2 చొప్పున పెంచడాన్ని సమర్థించుకున్నారు నిర్మల. ద్రవ్యోల్బణం భారీగా తగ్గిన పరిస్థితుల్లో పన్ను పెంపు పెద్ద ప్రభావమేమీ చూపదని స్పష్టం చేశారు.

మోటారు బిల్లుకు లోక్​సభ గ్రీన్​సిగ్నల్...

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై భారీ జరిమానాలు విధించడం సహా ప్రమాద బాధితులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు పరిహారం అందించేలా ఈ బిల్లు రూపొందించారు. రోడ్డు ప్రమాదాల్లో మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడేందుకు ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

భారీ జరిమానాలు...

ప్రతిపాదిత నూతన చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించే దిశగా కేంద్రం అడుగులు వేసింది. ఆన్‌లైన్‌లోనే లెర్నింగ్ లైసెన్స్‌ల మంజూరు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేలా ఇన్సూరెన్స్‌ నిబంధనలు సరళీకరణ ద్వారా ఈ చట్టం పనిచేయనుంది. ట్రాన్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ రెన్యువల్ కాలపరిమితిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచే అంశాన్ని ఈ బిల్లులో చేర్చారు. దివ్యాంగులకు లైసెన్స్‌లు జారీచేసేలా ప్రతిపాదనలు చేశారు. కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యువల్‌ గడువును నెల రోజుల నుంచి సంవత్సరానికి పెంచాలని ప్రతిపాదించారు.

గత లోక్​సభలోనే..

గత లోక్‌సభలోనే మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. రాజ్యసభలో మోక్షం లభించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విపక్షాల ప్రశ్నలకు కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కోబోదన్నారు.

ఇదీ చూడండి: అధికరణ 370 రద్దు: కశ్మీరీల అంగీకారమే కీలకం

ABOUT THE AUTHOR

...view details