ఈ కాలనీలో సుమారు 70 ఇళ్లుంటాయి. వారందరూ భారతీయులే. కానీ ఆధార్‌కార్డ్ సహా అన్ని గుర్తింపు కార్డుల్లో వారి చిరునామాలు మాత్రం 'పాకిస్థానీ వాలి గలీ' అనే ఉంటుంది. ఎందుకంటే వారుంటున్న ఆ కాలనీ పేరు.. పాకిస్థాన్ వారి వీధి.
దేశ విభజనకు ముందే పాకిస్థాన్ నుంచి కొందరు వచ్చి ఈ ప్రదేశంలో స్థిరపడ్డారు. అందుకే ఈ ప్రదేశానికి పాకిస్థానీ వారి వీధిగా పేరొచ్చింది. కానీ, ఈ పేరు కారణంగా ఇక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎన్నో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఆ పేరు చూడగానే తమను పాకిస్థాన్ దేశస్థులుగా ఊహించుకుంటున్నారని వాపోతున్నారు స్థానికులు.
"మా అమ్మా నాన్న పాకిస్థానీలు కాదు.. మేమూ పాకిస్థానీలము కాదు. మా తాత ముత్తాతలెవరో నలుగురు పాకిస్థాన్ నుంచి వచ్చారట. వారొచ్చినప్పుడు.. ఈ కాలనీ మొత్తం అడవిలా ఉండేది. మేము హిందుస్థాన్‌కు చెందిన వారిమే. కానీ మా వీధి పాకిస్థానీ అయిపోయింది. ఈ కారణంగా ఎక్కడికెళ్లిన సమస్యలు తలెత్తుతున్నాయి."-సంధ్యావతీ, కాలనీ వాసి.
సొంత దేశంలోనే వారిని పరాయివారిగా చూడడం అక్కడివారికి అస్సలు సహించడంలేదు. ఈ కాలనీ పేరు వల్ల కనీస సౌకర్యాలు, ప్రభుత్వం కల్పించే సదుపాయాలు తమకు అందడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.