ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు పాకిస్థాన్ భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తోందని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా చేస్తోందని చెప్పారు.
అయితే చొరబాటు వ్యతిరేక వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తున్నాయని దిల్బాగ్ స్పష్టం చేశారు. సొరంగాల నిరోధక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇటీవల బీఎస్ఎఫ్ గుర్తించిన సొరంగాన్ని డీజీపీ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
"అంతర్జాతీయ సరిహద్దు కింద సొరంగాలు తవ్వడం, ఉగ్రవాదులను దేశంలోకి ఎగదోయడం పాకిస్థాన్ దుర్మార్గపు ప్రణాళికలో భాగం. 2013-14లో చన్యారీ ప్రాంతంలో గుర్తించినటువంటి భారీ సొరంగం ఇప్పుడు బయటపడింది. సొరంగాల ద్వారా చొరబాట్లు జరుగుతున్నట్లు నగ్రోటా ఎన్కౌంటర్ తర్వాత మాకు పక్కా సమాచారం అందింది. గతంలోనూ ఈ సొరంగాలను ఉపయోగించి చొరబాటు దారులను పాకిస్థాన్ పంపించిందని స్థానికులు చెబుతున్నారు."
-దిల్బాగ్ సింగ్, జమ్ము కశ్మీర్ డీజీపీ